ధరణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

– కోర్టు కేసులకు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలి
– సీఎం కార్యాలయ దరఖాస్తులను 15 రోజులలోగా  పరిష్కరించాలి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  హరిచందన దాసరి  రెవెన్యూ అధికారులను ఆదేశించారు.  గురువారం ఆమె తన చాంబర్ నుండి జిల్లాలోని ఆర్డీవోలు, తహసిల్దార్లతో ధరణి, సీఎం ప్రజావాణి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధరణిలో టిఎం 33 లోకి  దరఖాస్తులు రాగానే తక్షణమే నోటీసు జారీ చేయాలని చెప్పారు. ధరణి దరఖాస్తులను  పెండింగ్ లో  ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జాప్యం చేయవద్దని సూచించారు. క్షేత్ర స్థాయిలో తనిఖీ  తర్వాత పరిష్కరించే వాటికి క్షేత్రస్థాయికి వెళ్లి  తప్పనిసరిగా తనిఖీ చేసి పరిష్కరించాలని చెప్పారు. తహసిల్దారుల లాగిన్ లో ఉన్న దరఖాస్తులను వేగంగా  పరిష్కరించడంలో ఆర్డీవోలు పర్యవేక్షించాలని, అంతేకాక తహసీల్దారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని, సాధ్యమైనంతవరకు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులకు తక్షణం స్పందించి  చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా క్షేత్రస్థాయిలో సర్వే సమస్యలు ఉన్నట్లయితే వాటిని జాబితా రూపొందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ప్రజావాణి దరఖాస్తుల పెండెన్సి పై ఆమె సమీక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన 15 రోజుల్లో గా  పరిష్కరించాలని, ఆన్లైన్లో వీటన్నిటిని పూర్తిచేయాలని, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వివిధ దినపత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తల పై రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవోలు, తహసిల్దారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
Spread the love