మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నశా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ మాట్లాడుతూ.. సమాజంలో రోజురోజుకూ యువతకు ప్రమాదకరంగా మారుతున్న మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఆవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇటీవల యువత గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారన్నారు. మాదక ద్రవ్యాలతో అనారోగ్యం పాలై జీవితం అంధకారమవుతుందని అన్నారు. యువత చదువుతోపాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, క్రమ శిక్షణతో కూడిన చదువు వలన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. అలాగే కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి ఎస్ మీనా మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ట్రాన్సమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, సెంట్రల్ బ్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ అసిస్టెంట్ రసిద్, సీబీసీ ఎంటిఎస్ పోచయ్య, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.