సీజేపీ ఉద్యమానికి వ్యకాస సంఘీభావం
పదో రోజుకు వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి రాష్ట్రపతి బర్తరఫ్ చేయాలని వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళన సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. అదే విధంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష పదో రోజుకు చేరుకుంది. ఈ పది రోజుల్లో వాంగ్‌చుక్ బరువు దాదాపు ఏడు కిలోలు తగ్గిందని వైద్యులు తెలిపారు. దీక్షను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరంతరం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి, జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారుల అనుమతి లేకుండా పోలీసులు ఫొటోలు తీయడంపై వివాదం చెలరేగింది. దీనిపై సీజేపీ కార్యకర్తలు ప్రశ్నించగా డీసీపీ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నామని పోలీసులు వివరించారు. మరోవైపు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లో నిర్వహించిన ఆందోళనలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు భారీగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
వ్యకాస సంఘీభావం
జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్న ఆందోళనకు అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మికు జాతీయ ఐక్య వేదిక సంఘీభావం తెలిపింది. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఎడబ్ల్యుయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, బీకేఎంయూ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, జాతీయ వేదిక నాయకులు సాహిల్ బహదూర్ శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష దేశ విద్యా వ్యవస్థను కాపాడడం కోసం, భావితరాల భవిష్యత్తును రక్షించడం కోసం జరుగుతున్న ఒక చారిత్రక దీక్ష అని పేర్కొన్నారు. విద్యను రక్షించడం అంటే దేశ భవిష్యత్తును రక్షించడమేనని అన్నారు. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు, మేధావులు, ప్రజాస్వామ్య శక్తుల మద్దతు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. దేశాన్ని కుదిపేసిన నీట్ ప్రశ్నాపత్రాల లీక్ కేవలం కొందరు వ్యక్తుల నేరం కాదని, మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్రీకృత, కార్పొరేట్ అనుకూల విద్యా విధానాల ప్రత్యక్ష ఫలితమేనని విమర్శించారు. ఈ కుంభకోణానికి పూర్తి నైతిక, రాజకీయ బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌దేనని పేర్కొంటూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ భావితరాల భవిష్యత్తును కాపాడేందుకు జరుగుతున్న ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి
- Advertisement -
- Advertisement -



