ప్రత్యక్ష పరిశీలన మంచి అనుభవం

– పథకాల అమలపై సంపూర్ణ అవగాహన
– జిల్లా పర్యటనకు వచ్చిన ఏఎస్‌ఓ శిక్షణ అధికారులతో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
నవతెలంగాణ – సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించడంతో మంచి పని అనుభవం వస్తుందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కు చెందిన ఏఎస్‌ఓలు (అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌) శిక్షణలో భాగంగా జిల్లాకు 27 మంది ఈ నెల 20 వ తేదీన రాగా, 24 వ తేదీన వారి పర్యటన ముగింపు సందర్భంగా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వారితో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ, పట్టణ గృహ నిర్మాణ, హైవే రహదారుల, కార్మిక, ఉపాధి కల్పన తదితర శాఖలకు ఎంపికైన ఏఎస్‌ఓలు ఐదు రోజుల్లో గ్రామాల్లో ఏమి పరిశీలించారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలును పరిశీలించడంతో సంపూర్ణ అవగాహన వస్తుందని వివరించారు. విధి నిర్వహణలో ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలలో ఇక్కడి పండుగలు, పూజలు, జీవన శైలి శిక్షణకు వచ్చిన వారందరికీ ఒక మధురానుభూతిగా నిలిచిపోతుందని కలెక్టర్‌ వివరించారు. శిక్షణకు వచ్చిన వారు తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి, ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌, ఎల్లారెడ్డి పేట మండలం బొప్పాపూర్‌, చందుర్తి మండలం సనుగుల, గంభీóరావుపేట మండలం నర్మాలలో గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, శ్మశాన వాటికలు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, అంగన్‌వాడీలు, ఎగువ మానేరు, వివిధ పంటల సాగు తీరును నేరుగా పరిశీలించారని జెడ్పీ సీఈవో ఉమారాణి తెలిపారు. ఇక్కడ రీజినల్‌ ట్రైనీ మేనేజర్‌ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love