నిరాశపర్చింది

– బీజేపీ ‘యాంటీ-మోడీ ఎజెండా’ ఆరోపణలపై యూఎస్‌ ఎంబసీ
న్యూఢిల్లీ: బీజేపీ చేసిన ‘యాంటీ-మోడీ ఎజెండా’ ఆరోపణలపై యూఎస్‌ ఎంబసీ తీవ్రంగా స్పందించింది. సదరు ఎజెండా వెనక యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉన్నదన్న బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ వ్యాఖ్యలు నిరాశపర్చినట్టు వివరించింది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మీడియా నివేదికలను యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ మ్యానుప్యులేట్‌ చేస్తున్నదన్న బీజేపీ వ్యాఖ్యలను యూఎస్‌ ఎంబసీ తప్పుబట్టింది. తాము ఇండిపెండెంట్‌ మీడియానే సపోర్ట్‌ చేస్తామనీ, వాటి ఎడిటోరియల్‌ నిర్ణయాలను ప్రభావితం చేయబోమని నొక్కి చెప్పింది. భారత్‌ను అస్థిరపర్చే ప్రయత్నాల్లో భాగంగా మోడీ, అధికార పార్టీ(బీజేపీ)లు లక్ష్యంగా జరుగుతున్న దాడుల వెనక యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉన్నదని ఈనెల 5న బీజేపీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో వరుస పోస్టులలో ఆరోపించిన విషయం విదితమే. ఇందులో భాగంగా, కొన్ని మీడియా సంస్థలకు యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి గణనీయమైన మొత్తంలో నిధులు అందుతున్నాయని బీజేపీ పేర్కొన్నది. ఈ ఆరోపణల పైనే యూఎస్‌ ఎంబసీ స్పందించింది. ”భారత్‌లోని అధికార పార్టీ ఈ రకమైన ఆరోపణలు చేయటం నిరాశను కలిగించింది. యూఎస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు వృత్తిపరమైన అభివృద్ధి, సామర్థ్య పెంపు శిక్షణకు మద్దతు ఇచ్చే ప్రోగ్రామింగ్‌పై స్వతంత్ర సంస్థలతో కలిసి పని చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్‌.. ఈ సంస్థల ఎడిటోరియల్‌ నిర్ణయాలను ప్రభావితం చేయదు. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ విషయంలో ఎంతో కాలం నుంచి యూఎస్‌ ఛాంపియన్‌గా ఉన్నది” అని యూఎస్‌ ఎంబసీ వివరించింది.

Spread the love