‘పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం’ అన్న చందంగా తయారైంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పరిస్థితి. అధికార మార్పిడి కాస్త తమ పదవులకు ఎసరు పెడుతుం డటంతో మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మెన్లు, ఎంపీపీలు, కార్పొరేషన్ మేయర్లు మొదలగు పరోక్షంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. నిన్నటి వరకు హంగు ఆర్భా టంతో ఒక వెలుగు వెలిగిన వీరు నేడు అవి శ్వాసం దెబ్బకు హడలి పోతున్నారు. మంచిర్యాల, ఆర్మూర్, నల్లగొండ మున్సిపాల్టీలు, పెద్ద పల్లి జిల్లా పరిషత్ చైర్మెన్, రామగుండం కార్పోరేషన్, మహదేవ్ పూర్ ఎంపీపీ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. గత పదేండ్లుగా అధి కారంలో ఉండటంతో బీఆర్‌ఎస్‌కు చెందిన వారే మెజార్టీ స్థానిక సంస్థలను ఏలుతున్నారు. అవిశ్వాస గండం నుంచి గట్టెక్కేందుకు చాలా మంది హస్తం గూటికి చేరేందుకు మంతనాలు జరుపు తుండగా, మరికొంతమంది తమను తాము కాపాడు కునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
– ఊరగొండ మల్లేశం