నవతెలంగాణ-భిక్కనూర్ : కంటి చూపు సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం భిక్నూర్ మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతి రావు పూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో దృష్టి లోపం కలిగిన విద్యార్థినులకు కళ్ల జోళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాల స్వస్త్ కార్యక్రమం క్రింద జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుచున్నదని దృష్టి లోపం కలిగిన విద్యార్థులకు కళ్ల జోళ్లను ఉచితంగా అందించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్ల స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు అవసరమైన కళ్లద్దాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ పాఠశాలల్లో 77 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. అనంతరం రెసిడెన్షియల్ స్కూల్ లోని కిచెన్, స్టోర్ రూం లను కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వం జారీ చేసిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. అనంతరం పదవ తరగతి గదిలో విద్యార్థినులతో మాట్లాడుతూ ఈ నెల 21 నుండి ప్రారంభం అయ్యే వార్షిక పరీక్షలో మంచి ప్రతిభ కనబరచి ఉత్తమ మార్కులను పొందాలని హార్డ్ వర్క్ చేయాలని తెలిపారు. స్కూల్ లో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఆప్తమాలిస్ట్ డాక్టర్ రవీందర్, ఆర్బ్ ఎస్కే డాక్టర్ మనోజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ మహాలక్ష్మి, ప్రిన్సిపాల్ విమలా దేవి, తహసీల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీఓ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.