పూల వనమైన గ్రామాలు.. ఆటపాటలతో హెూరెత్తిన పల్లెలు
ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు
నవతెలంగాణ-మల్హర్రావు
బతుకమ్మ,బతుకమ్మ ఉయ్యాలో...బంతి పూలతోట ఉయ్యాలో...ఇద్దరక్కజెల్లెళ్లు ఉయ్యాలో...ఇలా ఆదివారం మండలంలోని పల్లెల్లో ఎక్కడా చూసిన సద్దుల బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో హెూరెత్తాయి. మహిళలు, చిన్నారులు ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి నియమ నిష్ఠలతో గునుగ పూలు, తంగేడు, బంతి, చామంతి, గడ్డిపూలు, అల్లి పూలు, టేకు, గులాబీ ఇలా తిరొక్క పూలతో తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మలు పోటాపోటీగా పేర్చి తోడుగా చిన్న బతుకమ్మలు తయారు చేసి గౌరమ్మను పూజించారు.
సద్దుల బతుకమ్మ ఆడటానికి ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మహిళలు విచ్చేసి సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు ఆటపాటలతో నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గడ్డిపూలను దైవంగా కొలిచే తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా మండల కేంద్రమైన తాడిచెర్లతో పాటు అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మను వేడుకలను ఘనంగా నిర్వహించి, తెల్లవారుజామున చెరువుల్లో నిమజ్జనాలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తోపాటు ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)