Magazines

పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం

36 నిమిషాల క్రితం

cotton procurement
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- మార్కెట్ ధర కంటే తక్కువకు కొనుగోళ్లు..
- క్వింటాలుకు 5 కిలోల తూకంలో కోత విధిస్తున్నారని ఆరోపణ


నవతెలంగాణ నర్వ 

మండలంలోని పాతర్‌చేడ్ గ్రామ శివారులో నూతనంగా ప్రారంభించిన ప్రైవేట్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. క్వింటాలు పత్తికి రూ.9,200 మద్దతు ధర ఉండగా, రూ.8 వేలకే కొనుగోలు చేస్తున్నారని, అదనంగా క్వింటాలుకు 5 కిలోల చొప్పున తూకంలో కోత విధిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులకు ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకుల బృందం కాటన్ మిల్లును సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించింది. మద్దతు ధర కంటే తక్కువకు పత్తిని ఎందుకు కొనుగోలు చేస్తున్నారని, తూకంలో ఐదు కిలోల కోత విధించడంపై మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రైతులకు నష్టం కలిగించే విధానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, రైతుబంధు అందలేదని, సాగునీటి సరఫరా సక్రమంగా లేదని, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రకృతి, సాగు సమస్యలతో నష్టపోతున్న రైతులకు పత్తి కొనుగోళ్లలోనూ అన్యాయం జరగడం బాధాకరమన్నారు.రైతుల నుంచి పత్తిని నిబంధనల ప్రకారం, ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, తూకాల్లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, దండు అయ్యప్ప, వైస్ ఎంపీపీ శంకర్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్