- మంగళవారం రోజంతా ఎడతెరిపి లేని వర్షం
- రాష్ట్రంలోని 154 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
- 65 మి.మీ.లతో అశ్వారావుపేట రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
నవతెలంగాణ - అశ్వారావుపేట
మురుసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని 154 వర్షపాతం నమోదు కేంద్రాల్లో వర్షాలు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. అశ్వారావుపేట తర్వాత దమ్మపేట మండలం నాయుడుపేటలో 59 మి.మీ., మల్కారంలో 57.3 మి.మీ., ఖమ్మం జిల్లా వేంసూరులో 52.3 మి.మీ., సత్తుపల్లి జేవీఆర్ ఓసీపీలో 48.8 మి.మీ., సదాశివునిపాలెంలో 47.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. దమ్మపేట మండలం అంకంపాలెంలో 42.8 మి.మీ., నాగుపల్లిలో 40 మి.మీ. వర్షం కురిసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో 36.5 మి.మీ., చంద్రుగొండ మండలం మద్దుకూరులో 27.5 మి.మీ., ములకలపల్లి మండలంలో 25.5 మి.మీ., దమ్మపేట మండలం మండలపల్లిలో 22.8 మి.మీ., లక్ష్మీదేవిపల్లిలో 21.3 మి.మీ., చుంచుపల్లిలో 20.5 మి.మీ., పాల్వంచ మండలం సీతారాంపట్నంలో 18 మి.మీ., బూర్గంపాడులో 16.3 మి.మీ., కొత్తగూడెంలో 15.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, నిర్మల్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 2 నుంచి 5.5 మి.మీ. వరకు వర్షపాతం నమోదైంది. మొత్తంగా 154 ప్రాంతాల్లో వర్షాలు నమోదైనప్పటికీ అత్యధిక వర్షపాతం మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కేంద్రీకృతమైంది. ఒకవైపు తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా, మరోవైపు రహదారులపై వర్షపు నీరు చేరి కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.





కామెంట్లు (0)