Magazines

డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దెబ్బతిన్న 'విద్యుత్'  వ్యవస్థ 

13 గంటల క్రితం

electrical' system
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

- విద్యుత్ శాఖ అధికారుల పరిశీలన

- మీటర్ల మార్పిడికి విద్యుత్ శాఖ ఆదేశాలు 

నవతెలంగాణ-సత్తుపల్లి 

బేతుపల్లి పెద్ద చెరువు వరద ఉధృతి కారణంగా సత్తుపల్లి పట్టణ శివారులోని వేశ్యాకాంతల చెరువు సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలోని గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోని విద్యుత్ మీటర్లు పూర్తిగా పాడైపోయాయి. 96 మీటర్లు పాడైనట్లు విద్యుత్ శాఖ అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేసి గుర్తించారు. 


​విద్యుత్ శాఖ ఖమ్మం సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) ఈ. శ్రీనివాస చారి, సత్తుపల్లి డివిజనల్ ఇంజనీర్ ఎల్ రాములు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లారు. బుధవారం  సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా వేశ్యాకాంతల చెరువు నీరు ఉప్పొంగి గృహాల్లోకి వరద ప్రవేశించింది. ఈ వరదల ధాటికి సుమారు 96 విద్యుత్ మీటర్లు పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయి. ఇళ్లలోని గోడలు, వైరింగ్ తడవడంతో విద్యుత్ లీకేజీ, షార్ట్ సర్క్యూట్, ఇతర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 


భద్రత తనిఖీల అనంతరం సరఫరాను పునరుద్ధరణ చేస్తాం

​భద్రతా తనిఖీల అనంతరం విద్యుత్తు సరఫరా  పునరుద్ధరణ చేస్తామని సత్తుపల్లి విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ​ప్రజల రక్షణ దృష్ట్యా నిపుణులైన ఎలక్ట్రిషియన్లతో ఇళ్ల వైరింగ్‌ను గృహ యజమానులు తనిఖీ చేయించి, మరమ్మతులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. మరమ్మతుల సమాచారం అందించిన తర్వాత విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి ఇంటిని వేర్వేరుగా పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.  వైరింగ్ భద్రత సంతృప్తికరంగా ఉంటేనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే దెబ్బతిన్న 96 మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని విద్యుత్ శాఖ ఖమ్మం  సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) శ్రీనివాస్ చారి కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ పట్టణ ఏఈ ఉబ్బన శరత్ బాబు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్