- పునరావాస కేంద్రంలో 100 కుటుంబాలకు రూ.5 వేల నగదు, నిత్యావసరాల పంపిణీ
- మంత్రి పొంగులేటి సహకారంతో తక్షణ సహాయక చర్యలు
నవతెలంగాణ-సత్తుపల్లి
మురసు తుఫాన్ ప్రభావంతో వరద ముంపునకు గురై నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అండగా నిలిచారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులకు రూ.5వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో నివసిస్తున్న సుమారు 100 కుటుంబాలు భారీ వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. బాధితుల పరిస్థితిని వెంటనే గుర్తించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి, బుధవారం సాయంత్రం వారిని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించారు. అక్కడ వారికి కావలసిన వసతి, భోజన సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించారు. సత్తుపల్లి పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితుల పరిస్థితులను తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించడంతో, గురువారం ఎమ్మెల్యే స్వయంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం, రేషన్ సరుకులు అందజేశారు. ప్రభుత్వం బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటుందని, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)