బాసర ట్రిపుల్ ఐటీలో ఎన్‌-జెన్ పోస్టాఫీస్ ప్రారంభం

4 గంటల క్రితం

BASARA
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్

నవతెలంగాణ-ముధోల్
విద్యార్థుల్లో పొదుపు పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు ఆధునిక తపాలా సేవలను యువతకు చేరువ చేయాలనే లక్ష్యంతో బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్‌-జెన్ పోస్టాఫీస్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పొదుపు అలవాటును అలవర్చుకోవాలని సూచించారు. చిన్న మొత్తాలతో ప్రారంభించే పొదుపు భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు బలమైన పునాది అవుతుందని ఆయన అన్నారు. సంపాదన ప్రారంభమైన తర్వాతే పొదుపు చేయాలనే ఆలోచనను విడనాడి, విద్యార్థి దశ నుంచే క్రమం తప్పకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.


నేడు చేసే చిన్న పొదుపులే భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్‌లోని పోస్టాఫీస్‌ను సందర్శించి తపాలా శాఖ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు. నిజామాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఆదిలాబాద్ డివిజన్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్‌-జెన్ పోస్టాఫీస్ ఏర్పాటు ఉద్దేశం, ప్రత్యేకతలను వివరించారు. విద్యార్థులకు అనువైన వాతావరణంలో పోస్టాఫీస్‌ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దినట్లు తెలిపారు. పోస్టాఫీస్ అంటే కేవలం ఉత్తరాలు, పార్శిళ్ల పంపిణీ కేంద్రం మాత్రమే కాదని, ప్రస్తుతం బ్యాంకింగ్, బీమా, డిజిటల్ సేవలు అందించే సమగ్ర సేవా కేంద్రంగా రూపాంతరం చెందిందని వివరించారు.


తపాలా శాఖలో సాంకేతిక పరిజ్ఞానంతో అనేక మార్పులు వచ్చాయని, ఒకప్పుడు కాలినడకన ఉత్తరాలను చేరవేసిన వ్యవస్థ నేడు ఆధునిక రవాణా సౌకర్యాలు, డిజిటల్ సాంకేతికతతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన నగరాల్లో డ్రోన్ల ద్వారా తపాలా వస్తువుల పంపిణీ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. కోర్ బ్యాంకింగ్ విధానం ద్వారా పోస్టాఫీసుల్లో ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఆధార్ సేవలు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పార్శిల్, లాజిస్టిక్స్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, డాక్ సేవా యాప్ వంటి పలు సేవలను తపాలా శాఖ అందిస్తోందని వివరించారు. విద్యార్థులు ఈ సేవలపై అవగాహన పెంపొందించుకొని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జీయూకేటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) ఎస్. రాజేశ్వర్, భైంసా సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ జె. దిలీప్ కుమార్, జి. సందీప్, జాదవ్ కిరణ్, బాసర క్యాంపస్ సబ్ పోస్టాఫీస్ పోస్టుమాస్టర్ జి. రాధిక, తపాలా శాఖ అధికారులు, సిబ్బంది బుషి పవన్ కుమార్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్