నవతెలంగాణ – మహాదేవపూర్: దీపావళి పండుగ సందర్భంగా మహాదేవపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ ఆదివారం పాలకవర్గ సభ్యులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక ఏర్పాట్లు, లైసెన్సులను తనిఖీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా నీటి బకెట్లు, ఇసుక, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు మహమ్మద్ బిన్ అలీ, మహమ్మద్ నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)