- మండల సమావేశంలో నేలపై కూర్చుని నిరసన
నవతెలంగాణ-సత్తుపల్లి
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందంటూ బేతుపల్లి, కాకర్లపల్లి కాంగ్రెస్ రెబల్ సర్పంచులు దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), పొదిలి మారేశ్వరరావుతో పాటు కిష్టాపురం, సిద్ధారం బీఆర్ఎస్ సర్పంచులు భాను ప్రకాష్, మధు, తాళ్లమడ టీడీపీ సర్పంచ్ వంశీ నేలపై కూర్చొని నిరసనకు దిగి ఎంపీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావును నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ వంటి కార్యక్రమాలకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వారు వాపోయారు.
ఎన్నికల్లో తమపై పోటీ చేసి ఓడిపోయిన వారికి అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన వారి చేతుల మీదుగానే పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ, సీసీ రోడ్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహిస్తూ తమను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతూ సర్పంచులుగా ప్రజలు ఎన్నుకున్న తమను అవమానపరచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల్లో తమకు దక్కాల్సిన గౌరవం, సమాచారం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. కావాలని ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ఎంపీడీవో నాగేశ్వరరావు సర్పంచులుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇకముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకునే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కుర్చీల్లో కూర్చోవాలని కోరినా సర్పంచులు ఒప్పుకోకుండా నేలపైనే కూర్చుని నిరసన కొనసాగించారు. అధికారుల తీరు మారకపోతే భవిష్యత్తులో మరింతగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎంపీడీవో పలుమార్లు బతిమిలాడిన అనంతరం సర్పంచులు శాంతించి కుర్చీలపై ఆసీనులయ్యారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులతో నరసింహారావు మాట్లాడారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరక్కుండా చూసుకుంటానని ఎంపీడీవో నాగేశ్వరరావు హామీ ఇచ్చిన నేపథ్యంలో శాంతించాలని కోరారు. అనంతరం పలు శాఖల అధికారులు తమ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాలపై తీసుకుంటున్న చర్యలపై సభలో ప్రస్తావించారు.
ఈ సమావేశంలో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ట్రాన్స్కో పట్టణ, రూరల్ ఏఈలు ఉబ్బన శరత్ బాబు, హనుమంతరావు, ఆర్అండ్బీ జేఈ సిహెచ్. నాగేశ్వరరావు, పీఆర్ ఏఈ రమేష్, పశుసంవర్ధక శాఖ డాక్టర్ శశిదీప్, హెచ్ఈఓ వెంకటేశ్వరరావు, సీడీపీఓ సత్యవతి, హౌసింగ్ ఏఈ పవన్, ఎఫ్ఎస్ఓ కోటేశ్వరరావు, ఎంపీఓ జోత్స్నాదేవి పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్గా నియమితులై తొలిసారిగా మండల సమీక్ష సమావేశానికి హాజరైన చల్లగుళ్ల నరసింహారావును ఎంపీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు అధికారులు సన్మానించారు.







కామెంట్లు (0)