నవతెలంగాణ – బజార్హత్నూర్
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేయూత ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
బజార్హత్నూర్ మండల కేంద్రంలో శనివారం తిరుమల గార్డెన్స్‌లో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఎలాంటి పైరవీలు, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తుందని, కుటుంబ భద్రతకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ వెనుకబడిన బోథ్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా అర్హులైన వారికి చేయూత పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14,579 నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో బోథ్ నియోజకవర్గ పరిధిలో సుమారు 6 వేల పెన్షన్లు, బజార్హత్నూర్ మండలంలో 600కు పైగా పెన్షన్లు మంజూరయ్యాయని వివరించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారిని గుర్తించి పెన్షన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పెన్షన్ల మంజూరులో పారదర్శకత పాటిస్తూ అర్హులకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, డీఆర్టీఓ రవీందర్ రాథోడ్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)