– అమల్లో సిటీ పోలీస్ యాక్ట్
– నిబంధనలు అతిక్రమిస్తే సెక్షన్ 22 ప్రకారం చర్యలు తప్పవు
– ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
– బెట్టింగులు ఆడితే సమాచారం ఇవ్వాలి
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నవతెలంగా – కంఠేశ్వర్
హోలీ పండుగ సమయంలో ఇష్టం లేని వాళ్లపై రంగు చల్లొద్దని,సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే సెక్షన్ 22 ప్రకారం చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు గురువారం నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హోలీ అంటేనే రంగులు అలాంటి పండగను ప్రతి ఒక్కరు సంతోషంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. హోలీ పండగ సందర్భంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని సంతోషంగా రంగులు చల్లుకొని ఆనందంగా గడపాలన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పగడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. కావున ప్రజలు పోలీసువారికి సహకరించాలని సూచించారు. హోలీ పండగ నేపథ్యంలో ఎలాంటి సమస్యలున్న డయల్ 100, లేదా దగ్గర్లోని సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం అందించాలన్నారు. హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలియజేశారు. కమిషనరేట్ పరిధిలో అనుమతులు లేకుండా రంగులు చల్లరాదన్నారు.హోలీ సంబరాల పండుగ అని. అందరూ కలిసి చేసుకుంటూనే అది పండుగ అని అన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ స్నేహ పూర్వక వాతావరణం లో పండగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.హోలీ పండుగ సందర్భంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని,డ్రంకన్ డ్రైవ్ తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించనున్నట్లు, ద్విచక్ర వాహనాలు గుంపులుగా వెళ్లడం, స్టంట్లు చేయడం వంటివి చేయకుండా పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలన్నారు లేని యెడల, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ జరుగుతున్న సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాలో ఎవరైనా బెట్టింగ్ ఆడితే సమాచారం ఇవ్వాలని సూచించారు. బెట్టింగ్ పెట్టే వారితో పాటు యాప్లను రన్ చేసేవారిని కట్టడి చేస్తామని చెప్పారు. రంజాన్ పండగ రెండవ శుక్రవారం హోలీ పండుగ ఉండడంతో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని కోరారు. బంగులో గంజాయి లాంటి మత్తు పదార్థాలు కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.