ఏ దశలోనూ తప్పిదాలకు తావివ్వద్దు

 – విధులు అత్యంత కీలకమైనవి
 – ఎన్నికల మార్గదర్శకాలను విధిగా పాటించాలి
 – పోలింగ్ కు  ముందు రోజు పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్  పోలింగ్ నిర్వహించాలి 
 – కలెక్టర్ కర్ణన్
 నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్:
ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, ఏ దశలోనూ తప్పిదాలకు తావివ్వకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారంనాడు కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోలింగ్ అధికారుల, సహాయ పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. శిక్షణకు హాజరయిన పోలింగ్ అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేందుకు పోలింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. పోలింగ్ కు ఒకరోజు ముందు, పోలింగ్ రోజున, పోలింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, విధులు ఏమిటి అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్గివుండాలన్నారు. విధుల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ ప్రారంభానికి ముందు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాని, మాక్ పోల్ నిర్వహణపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన తెలిపారు. పోలింగ్ అధికారులు విధిగా మాక్ పోల్ సర్టిఫికెట్ ను సర్టిఫై చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల మార్క్ జాబితా పై జాగ్రత్త వహించాలన్నారు. ఈవిఎమ్ మిషన్, వివి ప్యాట్, బ్యాలెట్ యూనిట్ లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని పోలింగ్ అధికారులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఎన్నికల విధులకు సంబంధించి ప్రతి విషయాలు బుక్ లెట్ రూపంలో అందించడం జరిగిందని, దానిని చదువుకొని అవగాహన పొందాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, తమకు కేటయించిన విధులు సక్రమంగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిఇఓ బిక్షపతి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love