వైద్యో నారాయణ హరి

– నిస్వార్ధంగా సేవలు అందించినప్పుడే దేవుడు కూడా తోడుగా ఉంటాడు
– ప్రజలతో మమేకమై వారికి సేవ చేయాలనేదే నా ఉద్దేశం
– నాకు ఆ గుర్తింపు ఉంది కాబట్టే  ఈఅవకాశం
– గ్రూప్ వర్క్ చేయాలి.. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి.. వారిపై నా పర్యవేక్షణ ఉంటుంది
– హక్కులు, బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం 
– చెప్పినా వినకుంటే కఠినతరమైన చర్యలు.. ఉన్నతాధికారులకు నివేదికలు
– కర్నూలు, మెదక్, ఆర్మీలో పని చేసిన అనుభవం ఉంది
– జిజిహెచ్ నూతన సూపరింటెండెంట్ డాక్టర్  విట్టల్ భవాని శంకర్ నిత్యానంద్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
దేవుని ఆశీర్వాదం.. తల్లిదండ్రుల దీవెనలతో ఈ స్థాయికి వచ్చాను. ప్రజలతో మమేకమై వారికి సేవ చేయాలనేదే నా ఉద్దేశం. ఇప్పటికే నాలుగు శాఖల విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నాను. అందులో సక్సెస్ అయ్యాను.అందువల్లే సూపరింటెండెంట్ గా నాకు  అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరు గ్రూప్ వర్క్ చేయాలి.. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి.వారిపై నా పర్యవేక్షణ ఉంటుంది.హక్కులు, బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.చెప్పినా వినకుంటే కఠినతరమైన చర్యలు.. ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం. కర్నూలు, మెదక్, ఆర్మీలో పని చేసిన అనుభవం నాకు ఉంది. అని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా నూతనంగా అదనపు బాధ్యతలను తీసుకున్న మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్  డాక్టర్ విట్టల్  భవాని శంకర్ నిత్యానంద్ పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా అదనపు బాధ్యతలు తీసుకున్న నిత్యానంద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలపై ‘నవతెలంగాణ’ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. అయితే గతంలోని  సూపరింటెండెంట్ లు బాధ్యతారహిత్యంగా విధులను నిర్వర్తించారని ప్రజలు తెలుసుకున్నారు. మరి ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలతో తాత్కాలిక సూపరింటెండెంట్  గా విధుల్లో చేరిన డాక్టర్ విబి నిత్యానంద్ సక్రమంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి అటు  ప్రజల దృష్టిలో ఇటు ప్రభుత్వ దృష్టిలో మన్ననలు పొందుతారని ఆశిద్దాం.
మీ ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ? ఎప్పుడు జరిగింది? గాంధీ మెడికల్ కళాశాలలో 1993 సెప్టెంబర్ లో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను.
ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పనిచేశారు ? హైదరాబాద్, కర్నూలు, మెదక్, ఆర్మీ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేశాను.
నల్లగొండ కి ఎప్పుడు వచ్చారు? ఎంత కాలం నుండి ఇక్కడ పని చేస్తున్నారు? గాంధీ మెడికల్ కళాశాలలో 1993లో పిహెచ్సి  మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయిన తర్వాత అక్కడ విధులు నిర్వహిస్తూనే పీజీ పూర్తి చేశాను. 2011లో కర్నూలు మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ గా, 2013 – 14 లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశాను. 2019వ సంవత్సరంలో ప్రొఫెసర్ గా పదోన్నతి  ఆ వెంటనే నల్లగొండ మెడికల్ కళాశాలకు వచ్చి  పైథాలజీ హెచ్వైడిగా బాధ్యతలు తీసుకున్నాను.
మీరు పుట్టిన ప్రాంతం? విద్యాభ్యాసం? బెంగళూరు లో పుట్టాను. ఐదవ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏరోనాటికల్ స్కూల్, ఆరు నుండి ఇంటర్ వరకు కెవిఎస్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబిబిఎస్ పూర్తి చేశాను.
చార్జి తీసుకున్నారు కదా అడ్మినిస్ట్రేషన్ పరంగా అనుభవం ఉందా? నేను ఇప్పటికే నాలుగు విభాగాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను. పైథాలజీ  డిపార్ట్మెంట్ కు హెడ్ గా  ఉంటూ, మరోపక్క  విద్యార్థులకు పాఠాలు చెబుతూ,  బ్లడ్ బ్యాంక్ నిర్వహణను పర్యవేక్షిస్తూ, అకాడమిక్ సెక్షన్ నిర్వహణలోను  సక్సెస్ అయ్యాను. అందువల్లే సూపరింటెండెంట్ గా  అదరపు బాధ్యతలను నాకు అప్పగించారు.
చాలాకాలంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ఏ విధంగా అధిగమిస్తారు? చాలా కాంప్లికేటెడ్ ప్రాంతాలలో పనిచేసిన అనుభవం నాకు  ఉంది. ఆ అనుభవంతో  ఆత్మవిశ్వాసం దృఢమైనది. కర్నూలులోని కుల్చారం , మెదక్ లోని తిరుమలగిరి, ఆర్మీలో ఐదు సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేశాను. స్టాఫ్ అందరితో కలిసి  గ్రూప్ వర్క్ చేస్తూ నాకున్న ఆత్మవిశ్వాసంతో సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తా.  వైద్యో నారాయణ హరి అంటారు. వైద్య వృత్తిలో నిస్వార్ధంగా నేను సేవలు అందించినప్పుడే దేవుడు కూడా తోడుగా ఉంటాడు. ఆ విధంగా నేను చేశాను. ఆ గుర్తింపు ఉంది కాబట్టే నాకు ఈ అవకాశం వచ్చింది.
ఆసుపత్రిలో మందులలేమి ?వైద్యులు అందుబాటులో ఉండకపోవడం? చిన్నారుల మరణాలు వాటిపై ఏలాంటి చర్యలు తీసుకుంటారు?ఇకనుండి ఎవరి బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహించాలి. దానికి కావలసిన సలహాలు, సూచనలు ఇస్తాం. వారిపై పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా కూడా నిర్లక్ష్యం వహిస్తే కఠిన తరమైన చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం. వైద్యం చేయించుకునే క్రమంలో ప్రజలు కూడా   వారి విధులు, బాధ్యతలు, హక్కులు తెలుసుకునేలా అవగాహన కల్పిస్తాం. అటు సంబంధిత అధికారుల మీద పర్యవేక్షణ, ఇటు ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు, వసతులు  కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ కావాలని మీరు ఎందుకు అనుకున్నారు? దేవుని ఆశీర్వాదం, తల్లిదండ్రుల దీవెనలతో ఈ స్థాయిలో ఉన్నాను. మ్యాథ్స్ వైపు వెళ్లాలనుకున్న, తల్లిదండ్రుల కోరిక మేరకు వైద్య వృత్తి లోకి, ప్రజలతో ఉండాలని, వారికీ సేవ  చేయాలనేదే నా ఉద్దేశం.

Spread the love