– ఈబీలు కొనుగోలు చేసిన పలు ‘షెల్ కంపెనీ’లు
– వాటి నుంచి రాజకీయ పార్టీలకు నిధులు
– అత్యధిక మొత్తం అధికార బీజేపీకే
– ఈ కంపెనీల వెనకున్నదెవరో?
– ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి: మోడీ సర్కారును డిమాండ్ చేస్తున్న మేధావులు, నిపుణులు
న్యూఢిల్లీ: మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ల(ఈబీ) పథకం విషయంలో రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతున్నది. సాధారణంగా, తన ప్రతిష్టకు భంగం కలిగించే సత్యాలపై స్పందించటం ప్రధాని మోడీకి ఇష్టముండదు. ఈబీ పథకం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తన తొలి స్పందనను అందించటానికి ఆయన ఒకటిన్నర నెల సమయం తీసుకున్నారు. ఈబీల ద్వారా ”ఎవరు డబ్బు చెల్లిస్తున్నారో.. ఎవరు స్వీకరిస్తున్నారో ఇప్పుడు కనీసం అందరికీ తెలుసు” అని బహిరంగ సభలో చెప్పటం ద్వారా మోడీ.. కోర్టు తీర్పునూ తనకు అనుకూలంగా మల్చుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు ఎవరు ఎవరికి నిధులు ఇచ్చారో ఎవరికీ తెలియదని చెప్తూ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈబీ పథకాన్ని సమర్థించుకునే యత్నం చేశారు.
అయితే, ఈ ఈబీల ద్వారా ప్రధానంగా లాభపడింది బీజేపీ మాత్రమేనన్నది కాదనలేని వాస్తవమని విశ్లేషకులు అంటున్నారు. వివిధ సంస్థల నుంచి ఆ పార్టీకి దేశంలోనే మరే ఇతర పార్టీకి లేనంతగా వేలకోట్ల నిధులు వచ్చి చేరాయి. ముఖ్యంగా, దర్యాప్తులో ఉన్న కంపెనీలు, నష్టాల్లో ఉన్న సంస్థలూ బీజేపీకి నిధులు సమకూర్చటం చర్చనీయాంశంగా మారింది.
33 నష్టాల్లో ఉన్న కంపెనీలు (అనేక అనుమానిత షెల్ కంపెనీలు) రూ.576 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయని ‘ది హిందూ’ కథనం వెల్లడించింది. అందులో చాలా వరకూ బీజేపీకే నిధుల రూపంలో వెళ్లినట్టుగా తెలుస్తున్నది.
ఎస్బీఐ నుంచి సమాచారం బహిర్గతమైన తర్వాత ఈ కంపెనీల గురించి కీలక సమాచారం అందింది. ఈ కంపెనీలు 2016-17 నుంచి 2022-23 వరకు ఏడేండ్లలో దాదాపు రూ. 1 లక్ష కోట్ల మొత్తం నష్టాన్ని చవిచూసినట్టు తెలిసింది. ఇలాంటి నష్టాల్లో ఉన్న కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను ఎలా కొనుగోలు చేశాయి? ఈ కంపెనీల డైరెక్టర్లు ఎవరు? అసలు ఈ షెల్ కంపెనీల వెనుక ఎవరున్నారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలాంటి షెల్ కంపెనీలపై విచారణకు ఆసక్తి చూపకపోవటం గమనార్హం.
ఎలక్టోరల్ బాండ్స్ కేసు విచారణ సమయంలో ఇలాంటి షెల్ కంపెనీలను నిరోధించేందుకు సవరణలు చేయాలని కూడా సీజేఐ సూచించారు. ఇంత నష్టాల్లో ఉన్న ఈ షెల్ కంపెనీలను నియంత్రించే కీలుబొమ్మలు ఎవరు? భారతీయ ఓటరు ఈ వాస్తవాలను ఎప్పటికైనా తెలుసుకుంటాడా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు డబ్బు చెల్లిస్తున్నారో, ఎవరు స్వీకరిస్తున్నారో ఇప్పుడు అందరికీ తెలుసునన్న మోడీ వాదనను వట్టి మాటేనని దీనిని బట్టి అర్థమవుతున్నదని వారు అంటున్నారు.
నష్టాల్లో ఉన్న డొల్ల కంపెనీల వెనుక ఉన్న అసలు దాతలను కనిపెట్టటంపై మోడీ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టయితే, ఈ కంపెనీల డైరెక్టర్లను ప్రశ్నించాలని ఈడీ, సీబీఐలను కోరేదని అంటున్నారు. అయితే, వేల కోట్ల నిధులను స్వీకరించిన అధికార బీజేపీ సర్కారు మాత్రం అంత ధైర్యం చేయదని వారు అంటున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రకటించిన తర్వాత అనేక షెల్ కంపెనీలు సృష్టించబడినట్టు కొన్ని వార్త కథనాలను బట్టి తెలుస్తున్నది. మూడు సంవత్సరాల ఉనికి రికార్డు కలిగిన ప్రస్తుత కంపెనీలు మాత్రమే బాండ్ కొనుగోళ్లలో పాల్గొనవచ్చని ఈబీ పథకం నిబంధన. అయితే, ఈ నిబంధనను కూడా తీవ్రంగా ఉల్లంఘనకు గురైందనీ, దీనిపై కూడా ప్రత్యేక విచారణ అవసరమని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, నిపుణులు అంటున్నారు. ”నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను” అని అవినీతిపై సహించేది లేదనే మోడీ.. ఇలాంటి కంపెనీలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నారు.