– సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ-ఓయూ
మెట్టుగూడ, దూద్ బాయ్ పాఠశాలకు సరైన రోడ్డు మార్గం కల్పించాలని సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ కోరారు. సర్కార్ బడులను బలోపేతం చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రభుత్వ బడుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మెట్టుగూడ, దూద్ బారు లోని ప్రాథమిక పాఠశాలను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూద్ బాయ్ ప్రభుత్వ పాఠశాలకు సరియైన రోడ్డు, అదేవిధంగా ప్రధాన దారి లేకపోవడంతో స్కూలుకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. మరోపక్క సరైన మౌలిక వసతులు లేక తల్లిదండ్రులు ప్రయివేటు స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. దాంతో ఫీజుల భారంతో పేద వర్గాల విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని తెలిపారు. స్కూలుకు సరైన రోడ్డు మార్గం, ప్రధాన ద్వారం మౌలిక వసతులు కల్పిస్తే బస్తీ పిల్లలంతా చదువుకునేందుకు వీలుంటుందని కావున ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకమైనదని… రుచి లేని పప్పు పెడుతున్నారన్నారు. దీంతో అనేకమంది పిల్లలు పోషకాహార లోపానికి గురవుతున్నారని కావున ప్రభుత్వం ప్రభుత్వ బడులలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఆర్‌ఓ వాటర్, ఏర్పాటు చేయాలని కోరారు. పిల్లలకు సరిపడా తరగతి గదులను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఫీజుల పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రయివేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తని ఖీలు నిర్వహించి వారి ఆగడాలను కట్టడి చేయాలని కోరా రు. పార్టీ నాయకులు కొమురెల్లి బాబు, యాదగిరి, చందర్, గౌరీ నాగరాజ్, శ్రీహరి, బిక్షపతి, మల్లేష్ పాల్గొన్నారు.