బీఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో దుబ్బాక ఎమ్మెల్యే

నవతెలంగాణ – రాయపోల్

బీఆర్ఎస్ కార్యకర్త బ్యాగరి శివకుమార్ (23) బుధవారం సాయంత్రం గుండెపోటుతో ఆకస్మిక మరణం రాయపోల్ గ్రామ వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బ్యాగరి శివకుమార్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ, పార్టీలో ముఖ్యులుగా ఎదుగుతున్నాడు. దళిత, బహుజన ఉద్యమాలు, అనేక కార్యక్రమాలలో చురుకుగా ఆసక్తిగా పాల్గొనేవాడు. ఇటీవల జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికలలో పార్లమెంటు ఎన్నికల్లో ఎంతో చురుకుగా పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ముమ్మారంగా ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో చురుకుగా పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అధిక ఓట్లు వచ్చే విధంగా కృషి చేశాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండానే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆకస్మిక మృతి చెందడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివకుమార్ గ్రామంలో అందరితో కలుపుగొలుపుగా ఉంటూ ఎంతో ప్రేమ ఆప్యాయతగా మాట్లాడేవాడు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించగా దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివకుమార్ ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. ఎదిగిన కొడుకు తల్లిదండ్రుల కళ్ళముందే మరణిస్తే వారి గర్భశోకాన్ని తీర్చడం ఎవరివల్లా కాదన్నారు. శివకుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధైర్య పడవద్దు కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా కల్పించారు. తక్షణ సహాయం కింద కుటుంబ సభ్యులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. శివకుమార్ కుటుంబ పరిస్థితి పేదరికంతో కొట్టుమిట్టాడటంతో చాలామంది దాతలు ముందుకు వచ్చి అంత్యక్రియల ఖర్చులకోసం సహకారం అందించారు. శివకుమార్ తో పాటు చదువుకున్న 2014 -2015 బ్యాచ్ స్నేహితులు రూ. 25 వేలు, రాయపోల్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు రూ.12 వేలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి రూ.5 వేలు, రాయపోల్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వెంకట్ రూ.1000, రాంసాగర్ హరీశ్ రూ.1000, బిజెపి నాయకులు రామచంద్రం రూ. 500, బీఆర్ఎస్ నాయకులు మాసాన్ పల్లి రాజు రూ.500, బిజెపి నాయకులు నీల స్వామి రూ.500, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన రూ.500, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగి వెంకటేష్ రూ.500, బి.ఆర్.ఎస్ నాయకులు రామచంద్రం గౌడ్ రూ.500, కుమ్మరి రాజు రూ.300, తుడుం ప్రశాంత్ రూ.200. అందజేసి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. శివకుమార్ అంత్యక్రియలు స్నేహితులు, రాజకీయ నాయకులు, బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. చిన్న వయసులోనే శివ కుమార్ మరణించడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయి విషాదఛాయలు అలుమకున్నాయి. అంతిమయాత్రలో అశేష జనం పాల్గొని ఘన నివాళి అర్పించారు.
Spread the love