యూట్యూబ్‌ ఛానెల్స్‌ బ్లాక్‌పై డీయూజే ఆగ్రహం

యూట్యూబ్‌ ఛానెల్స్‌ బ్లాక్‌పై డీయూజే ఆగ్రహం– ఐటీ చట్టం దుర్వినియోగమవుతున్నదని ఆరోపణ
– మోడీ సర్కారు తీరుపై ఖండన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు డిజిటల్‌ హిందీ న్యూస్‌ ఛానెల్‌ ‘బోల్తా హిందుస్థాన్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌ తొలగించబడింది. ఈ ఛానెల్‌ 2015 నుంచి ప్రసారమవుతున్నది. న్యూస్‌ ఛానెల్‌ ఎడిటర్‌ సమర్‌ రాజ్‌ ఈ అంశంపై స్పందించారు. యూట్యూబ్‌ ఛానెల్‌ను బ్లాక్‌ చేయటానికి ఎలాంటి కారణాన్ని కూడా తమకు అందించలేదని చెప్పారు. ఈ విధంగా సోషల్‌ మీడియా ఛానెల్స్‌ను బ్లాక్‌ చేయటంపై ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (డీయూజే) ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును ఖండించింది. సోషల్‌ మీడియా, ఖాతాలను మూసివేయటానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం, 2021 దుర్వినియోగం పెరిగిపోతున్నదని ఆందోళనను వ్యక్తం చేసింది.
దీనిని మీడియా బెదిరింపుగా అభివర్ణించింది. బ్లాక్‌ అయిన ఇతర ఛానెళ్లతో పాటు ప్రస్తుత ఛానెల్‌ను కూడా వెంటనే పునరుద్ధరించాలని డీయూజే డిమాండ్‌ చేసింది. ”సోషల్‌ మీడియా ఛానెల్‌లు, హ్యాండిల్‌ షట్‌డౌన్‌లు తరచుగా జరుగుతున్నాయని మేము గమనించాము. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ‘ఆర్టికల్‌19-ఇండియా’ ఫేస్‌బుక్‌ ఖాతా పరిమితం చేయబడింది.
గతేడాది నవంబర్‌ 27న యూట్యూబ్‌ మీడియా స్టార్‌ వరల్డ్‌ ఛానెల్‌ ఆకస్మికంగా రద్దైంది. అయితే నిరసనల తర్వాత దాన్ని పునరుద్ధరించారు. గతేడాది ఆగస్టులో గ్రామీణ భారత్‌పై నివేదికలు అందించే వార్తా వెబ్‌సైట్‌ ‘గావ్‌ సవేరా’ సోషల్‌ మీడియా హ్యాండిల్‌లు ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు బ్లాక్‌ చేయబడ్డాయి. జర్నలిస్ట్‌ మన్‌దీప్‌ పునియా తన ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతాలను బ్లాక్‌ చేసే చర్య బహుశా రైతుల ఆందోళనపై తన విస్తృతమైన కవరేజీని ఆపివేసినట్టు చెప్పారు. అలాగే, ‘ది కాశ్మీర్‌ వాలా’ వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా ఖాతాలు గతేడాది ఆగస్టులో భారత్‌లో నిలిపివేయబడ్డాయి”అని డీయూజే ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఐటీ రూల్స్‌, 2021.. పౌరులు, సంస్థల ప్రాథమిక భావ వ్యక్తీకరణ హక్కును ఉల్లంఘిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని వివరించింది.
గూగుల్‌(దీని ఆధీనంలోనే యూట్యూబ్‌ ఉంటుంది) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఛానెల్‌ని తీసివేస్తున్నట్టు బోల్టా హిందుస్థాన్‌కు తెలియజేయటం గమనార్హం. అయితే ఇందుకు ఎలాంటి కారణాలనూ అందించలేదు. ”ప్రజాస్వామ్యంలో పారదర్శకత ప్రధానమైనది. బోల్టా హిందుస్థాన్‌పై చర్య తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ, గూగుల్‌ వెంటనే ఆధారాలను అందించాలి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లేదా సంస్థకు పూర్తి కారణాలను అందించాలి అనేది చట్టంలో ప్రాథమిక సూత్రం” అని డీయూజే వివరించింది. రెండు నెలల క్రితం బోల్తా హిందుస్తాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా కూడా ఏకపక్షంగా తొలగించబడిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనలతో కేంద్ర బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపించింది.
జర్నలిస్టులకు వ్యతిరేకంగా.. అధికార బీజేపీ నాయకుడు, సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ భాటియా ఈనెల 5న ఢిల్లీ హైకోర్టులో ‘ఆర్టికల్‌-19’కి చెందిన యూట్యూబర్‌ నవీన్‌ కుమార్‌, నీలుపై పరువు నష్టం దావా వేసిన సందర్భాన్ని డీయూజే ఉదహరించింది.

Spread the love