Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రి జార్కిహోళి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.3 కోట్ల నగదు స్వాధీనం

మంత్రి జార్కిహోళి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.3 కోట్ల నగదు స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : కర్నాటక ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. దాదాపు 37 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. సోదాల్లో లభించిన నగదు తనదేనని, దానికి సంబంధించిన పత్రాలను సమర్పిస్తానని మంత్రి జార్కిహోళి స్పష్టం చేశారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలు, విదేశాల్లో అక్రమ పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు బెంగళూరు, బెళగావి సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది. మంత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. బెళగావిలోని మంత్రి నివాసంలో సుమారు రూ.3 కోట్ల నగదును, బెంగళూరులోని ఇంటి నుంచి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

సోదాలు ముగిసిన అనంతరం మంత్రి జార్కిహోళి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తామన్నారు. “స్వాధీనం చేసుకున్న నగదు మాదేనని చెప్పాం. దానికి సంబంధించిన పత్రాలు కూడా అందజేస్తాం. విదేశీ పెట్టుబడుల గురించి అధికారులు ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టే దశలోనే ఉన్నామని వారికి వివరించాం” అని తెలిపారు. ఈడీ చర్యల వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. “కేవలం నోటీసులు ఇచ్చి సమాచారం అడగాల్సింది పోయి, నేరుగా సోదాలు చేయడం వెనుక కారణం అర్థం కావడం లేదు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య కావచ్చు” అని జార్కిహోళి అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ నాయకులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని, బీజేపీ నేతలపై ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -