నవతెలంగాణ – కంఠేశ్వర్
అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే సీ.పీ.ఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సీ.పీ.ఆర్ శిక్షణ ఆవశ్యకతపై శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటుకు లోనై ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సీ.పీ.ఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం మాట్లాడుతూ.. సీపీఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీపీఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం అనేకమంది ఆకస్మికంగా గుండెపోటుకు గురవుతున్నారని, అత్యవసర చికిత్స అందక మృతి చెందుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాలలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సరైన విధానంలో సీపీఆర్ చేస్తే, కనీసం 10 మందిలో ఐదుగురు బ్రతికేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీ.పీ.ఆర్ టెక్నీక్స్ తెలుసుకున్న వారు, ఒక్కొక్కరు మరో పది మందికి నేర్పించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరు సీపీఆర్ గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనివల్ల ఆపద సమయంలో తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యుఓ రసూల్ బీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావ్ తదితరులు పాల్గొన్నారు.