అంతా ఇష్టా‌రాజ్యం..!

Everything is wishful thinking..!– నిబంధనలు విస్మరిస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలు
– అరకొర వేతనాలతో ఉపాధ్యాయుల నియామకం
– కొన్ని పాఠశాలల్లో అర్హత లేనివారితోనూ బోధన
– పర్యవేక్షణ మరిచిన విద్యాశాఖ అధికారులు
ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అంతా తమ ఇష్టారాజ్యమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం, విద్యాశాఖ రూపొందించిన నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారు. మరోపక్క కొన్ని ప్రయివేటు పాఠశాలలు అర్హతలేని వారిని నియమించి తక్కువ వేతనాలతో బోధన కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. విద్యాశాఖ పర్యవేక్షణలో జరగాల్సిన ఉపాధ్యాయుల నియామకాన్ని ఆయా పాఠశాలల యాజమాన్యాలే చేపడుతున్నాయి. ఇలా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు మామూలుగా తీసుకుంటూ వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా అందులో పనిచేసే ఉపాధ్యాయులతో పాటు చదువుకొనే విద్యార్థులు సైతం నష్టపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటూ విద్యార్థులకు విద్యనందిస్తుండగా..మరికొన్ని పాఠశాలలు మాత్రం విద్యను కూడా వ్యాపారపరంగానూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని..నాణ్యమైన విద్యనందిస్తున్నామని చెబుతున్నా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. విద్య, సౌకర్యాలు ఎంత అధునాతంగా ఉన్నా.. ఫీజులు సైతం అంతకంటే భారీగానే ఉంటున్నాయనేది బహిరంగ సత్యమే. మరోపక్క ప్రభుత్వ ప్రమాణాలు పాటించకుండా..ఫీజు నియంత్రణ కమిటీలు లేకుండా ఇష్టారీతిన పెంచుతూ అందినకాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలలైతే ఏకంగా స్కూళ్లలోనే పుస్తకాలు, బట్టలు విక్రయిస్తూ నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. ఇలాంటి వాటిపై దృష్టిసారించాల్సిన విద్యాశాఖ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. బడుల పర్యవేక్షణ మరిచిపోవడం.. అటు వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం మూలంగా కొన్ని ప్రయివేటు విద్యా సంస్థల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోందనే ఆరోపణలున్నాయి.
అరకొర వేతనాలతో సరి..!
ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు విద్యాశాఖ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారించడం లేదు. నిబంధనల ప్రకారం అందులో ఉపాధ్యాయులను నియమించాలంటే కచ్చితంగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. తదనంతరం విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలోనే అర్హత కలిగిన వారిని నియమించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలో బోధించేందుకు డీఎడ్‌ పూర్తిచేసి ఉండటం.. ఉన్నత పాఠశాలల్లో బీఈడీ పూర్తిచేసిన వారిని నియమించాల్సి ఉంటుంది. మరోపక్క ఇలా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు సైతం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. పే స్లిప్‌లను పాఠశాలలో అందుబాటులో ఉంచాలి. కానీ అనేక పాఠశాలల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. కేవలం అరకొర వేతనాలు అందించి బోధన చేయిస్తున్నారు. మరోపక్క కొన్ని పాఠశాలల్లో అర్హత లేని వారిని కూడా నియమిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాల రికార్డుల్లో మాత్రం అర్హత కలిగిన ఇతరుల పేర్లు రాసి..అర్హత లేని వారితో బోధన చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నా..విద్యాశాఖ అధికారులు కనీసం వాటిని పరిశీలించి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గతంలో నిబంధనలు విస్మరించిన ప్రయివేటు పాఠశాలలపై చర్యలు చేపట్టిన విద్యాశాఖ కొన్నేండ్ల నుంచి పర్యవేక్షణను పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే అపవాదు వస్తోంది.

Spread the love