ఎగ్జామ్‌ ఫియర్‌

Fear Of examsఎగ్జామ్‌ ఫియర్‌ అనేది ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో ఎదుర్కొనే అతి సాధారణమైన విషయం. దీన్నే ‘ఎగ్జామ్‌ ఫోబియా’ అని కూడా అంటారు. హేతుబద్దమైన కారణం లేకుండా కలిగే భయాన్నే ‘ఫోబియా’ అంటారు కానీ విద్యార్థుల్లో ఏర్పడే ఎగ్జామ్‌ ఫోబియా అనేది కేవలం సందర్భాన్ని బట్టి కలిగే భయం మాత్రమే.
భయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో పాజిటివ్‌ ఎమోషన్‌గానే చెప్పుకోవాలి. మనం మన లక్ష్యాన్ని చేరుకోవటంలో భయం అనేది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. లేకుంటే మనలో వుండే అతి విశ్వాసం, అశ్రద్ధ, వాయిదా వేసే మనస్తత్వం అనే లక్షణాలు మన లక్ష్యాన్ని దూరం చేస్తుంటాయి. భయం వాటన్నింటికి చెక్‌ పెడుతుంది. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఏర్పడే భయం కూడా అలాంటిదే.
అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. అందరు విద్యార్థుల్లో భయమనేది ఒకే స్థాయిలో వుండదు. అది వాళ్ల వ్యక్తిత్వం, సిట్యువేషన్‌ని వాళ్లు తీసుకునే విధానం మీద ఆధారపడి వుంటుంది.
భయానికి కొన్ని కారణాలు :
– ప్రిపరేషన్‌లో లోపం
– గ్రేడ్స్‌కి ప్రాముఖ్యత ఇవ్వడం
– ఏకాగ్రత లేకపోవడం, తక్కువ జ్ఞాపకశక్తి… ఈ కారణాల వల్ల చదివింది గుర్తుండకపోవడం
– కొన్ని సబ్జెక్ట్ల్‌ల పైన ఆసక్తి లేకపోవడం లేదా కష్టంగా అనిపించడం.
– తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఎక్స్‌పెక్టేషన్స్‌
– తమపై తమకి నమ్మకం లేకపోవడం
– ఒకవేళ ఫెయిల్‌ అయితే జూనియర్స్‌తో కలిసి మళ్లీ అదే క్లాస్‌ చదవాల్సి వస్తుందేమో అన్న ఊహ
– క్లాస్‌రూంలో తరచుగా ఉపాధ్యాయులు చేసే నెగెటివ్‌ కామెంట్స్‌.
– ప్రిపరేషన్‌ సమయంలో ఆటంకం కల్పించే ఆరోగ్య సమస్యలు
– కుటుంబ వాతావరణం.
వీటితో పాటుగా మరొక ప్రధానకారణం ఏంటంటే.. నెక్స్ట్‌ చేయాలనుకునే కోర్సులు ప్రత్యేకంగా టాప్‌ ఫైవ్‌, టాప్‌ టెన్‌ వంటి విద్యాసంస్థల్లోనే చేయాలని చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు కలలు కంటూ వుంటారు. అందుకు అవసరమైన పర్సంటేజ్‌ ఈ పరీక్షల్లో సాధించగలమో లేదో అనే ఆందోళన కూడా విద్యార్థుల్లో వుంటోంది.
భయాన్ని అధిగమించడం ఎలా?
మనసుని చదువుపై కేంద్రీకరించడం, కష్టపడి పనిచేయడం… ఈ రెంటింటిలోనే మీ విజయం ఆధారపడి వుంది. అందుకు మీరు ఒక చక్కని ప్రణాళికని రూపొందించుకోవాలి.
మనం సక్సెస్‌ఫుల్‌ పీపుల్‌గా చెప్పుకుంటున్న వాళ్లంతా తమ కేరీన్‌ని ప్రణాళికా బద్ధంగా ప్లాన్‌ చేసుకున్నవాళ్లే.
కాబట్టి పరీక్షల విషయంలో మీరు కూడా అదే పంధా అవలంభించాలి. అప్పుడే సక్సెస్‌ అనేది మీ సొంతం అవుతుంది. పరీక్షలకి కొద్ది నెలల ముందునుంచే మీరు ప్రణాళికని సిద్ధం చేసుకోండి. పరీక్షలకు వున్న గడువుని, మీ మొత్తం సిలబస్‌ని దృష్టిలో పెట్టుకుని మీ షెడ్యూల్‌ని తయారు చేసుకోండి.. ఇది మొదటి మెట్టు. దాన్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడే మీకు సక్సెస్‌ లభిస్తుంది. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి.
మీరు ఎంత పట్టుదలగా షెడ్యూల్‌ని ఫాలో అయినా ఒక్కోసారి అనుకోని ఆటంకాలు మీ ప్రిపరేషన్‌కి అడ్డంకులు కావచ్చు. అడ్డంకులు ఏర్పడినంత మాత్రాన మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనం ప్రణాళికని రూపొందించుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ‘ప్లాన్‌ బి’ని కూడా సిద్ధం చేసుకుని వుండాలి. అంటే ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినా ప్రిపరేషన్‌కి ఆటంకం కలగకుండా ఎలా మేనేజ్‌ చేసుకోవాలి అన్న దానికి కూడా మీరు ముందుగానే ప్రిపేర్‌ అయి ఉండాలి. దానివల్ల సమయం వృథా కాదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా వుండదు.
ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత ప్రతివారం మీ ప్రోగ్రెస్‌ని కనుక మీరు గమనించుకోగలిగితే మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ‘మనం విజయానికి మరింత దగ్గర అవుతున్నాం’ అన్న ఆలోచన మీలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పరీక్షలకి ఒక వారం ముందుగానే మీ రివిజన్‌ అంతా కంప్లీట్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం వుండదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించినా మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో తోడ్పడతాయి.
ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి :
విజయం సాధించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా కలలు కంటూ కూర్చుంటే మీ మెదడుకు వున్న శక్తిని వృధా చేస్తున్నట్టే. మీ తెలివితేటల్ని ఎప్పుడూ తక్కువగా లేదా ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. రెండూ మంచిది కాదు.
పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. మీలో వున్న ప్రతిభని గుర్తించి, మెరుగుపరుచుకోవడం. విషయాన్ని బట్టీ పట్టడం కన్నా ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోగలిగితే పరీక్షల్లో ప్రశ్నలకి సమాధానం రాయటం సులభం అవుతుంది. విషయం మీద పూర్తి అవగాహన వుంటుంది కాబట్టి, ఒకవేళ సమయానికి పుస్తకంలోని విషయం గుర్తురాకపోయినా కంగారు పడకుండా మీకున్న పరిజ్ఞానంతో సమాధానం రాయగలుగుతారు. కాబట్టి బట్టీ చదువుల కన్నా అవగాహనతో చదివే చదువు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఇటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవటానికి టీం వర్క్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ మైండ్‌ సెట్‌కి మ్యాచ్‌ అయ్యే మిత్రులతో కలిసి సబ్జక్ట్‌ డిస్కస్‌ చేయడం, నాలెడ్జ్‌ షేర్‌ చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అవసరం అనిపిస్తే పరీక్షల ముందు మీరే చొరవ తీసుకుని ఉపాధ్యాయుల సలహాల్ని, సహాయాన్ని తప్పకుండా తీసుకోవాలి.
సాకులు చెప్పకండి :
‘మిమ్మల్ని మీరు నమ్మండి. మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి’ : ఇది విద్యార్థుల్ని వుద్దేశించి స్వామీ వివేకానంద చెప్పిన మాటలు.
నమ్మకం అనేది మనం పనిచేసే తీరులో వుంటుంది. అదేదో మహాద్భుతమైన రహస్య శక్తి కాదు. ‘నేను చెయ్యగలను’ అన్న దృఢమైన ఆలోచనే మీరు చేసే పనికి అవసరమైన శక్తినీ, నేర్పునీ మీలో ఉత్పన్నం చేస్తుంది. ఆ నమ్మకం మనలో వుంటే మార్గం అదే కనిపిస్తుంది.
మీపై మీకు ఆ నమ్మకం లేనప్పుడే సాకులు చెప్పటం మొదలు పెడతారు. సాధారణంగా విద్యార్థులుచెప్పే సాకులు నాలుగు రకాలుగా వుంటాయి.- నాకు చదివే మూడ్‌ లేదు
– సబ్జెక్ట్‌ చాలా కష్టంగా వుంది లేదా ఆ సబ్జెక్ట్‌ అంటే నాకు ఇంట్రస్ట్‌ లేదు
– నాకు అన్ని తెలివితేటలు లేవు
– నాకు చదువు మీద ఇంట్రస్ట్‌ లేదు. స్కూలింగ్‌ అయ్యాక నేను వేరే ప్రొఫెషన్‌కి వెళ్లాలనుకుంటున్నాను.
నిజానికి వాళ్ల మాటల్లో కూడా వాస్తవం లేకపోలేదు. అలా అని ‘కష్టం అనిపించగానే వదిలివేయటం’ అనే ప్రాక్టీస్‌ మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలోకి వెళ్లాలన్నా మినిమమ్‌ ఎడ్యుకేషన్‌ అనేది చాలా అవసరం. అంతేకాదు, మీరు ఏ రంగంలో అయినా సరే నెం.1 గా నిలబడాలంటే ఎన్నో ఛాలెంజెస్‌ని ఎదుర్కోవాల్సి వుంటుంది. దానికి పునాదులు వేసుకోవాల్సింది స్కూలింగ్‌ దశలోనే. కాబట్టి సాకులన్నీ పక్కన పెట్టేయండి. రిజల్ట్‌ మీద కన్నా సబ్జెక్ట్‌ మీదే ఎక్కువ పట్టుదల, దృష్టి సారించండి. ఫలితం అదే వస్తుంది. ఫలితం ప్రయత్నంలోనే దాగి వుంటుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి.
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో కలిగే భయాందోళనలకి ఇది కూడా ఒక ప్రధాన కారణం అవుతోంది. కంపారిజన్‌ ఎప్పుడు, ఎక్కడ, ఎలా వుండాలో తెలియకపోవటమే దానికి కారణం. పిల్లల్లో దీనిపై అవగాహన కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే వుంది. పిల్లలందరి ఐక్యూ ఒకేలా వుండదు. అందరూ ఒకే రకమైన నైపుణ్యాన్ని కలిగి వుండరు. అందువల్ల విద్యార్థుల మధ్య పోలిక అన్నది సరైనది కాదు.
ఇతరులతో పోటీ పడడం కన్నా మనతో మనం పోటీ పడడంలోనే నిజమైన విజయం దాగి వుంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. అంటే గడిచిన పరీక్షల్లో సాధించిన ఫలితాలకన్నా రాబోయే పరీక్షల్లో ఇంకా మెరుగైన ఫలితాల్ని సాధించాలన్న పట్టుదల మిమ్మల్ని సక్సెస్‌కి మరింత దగ్గర చేస్తుంది.
మెదడుకి విశ్రాంతి అవసరం :
మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెదడుపైనే ఆధారపడి వుంటాయి. కాబట్టి పరీక్షల సమయంలో మెదడుకి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మీ షెడ్యూల్లో దీనిక్కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రిపరేషన్‌ మధ్యలో ఒక గంట లేదా అరగంట పుస్తకాన్ని పక్కనపెట్టి మనసుకి హాయిగా వుండే పనులు చేయండి. అలా అని టీవీ ముందు కూర్చోవద్దు. పిల్లల మెదడుని ప్రభావితం చేసే శక్తి టీవీకి వుంది. అది మీ ఏకాగ్రతని దెబ్బతీసే అవకాశం వుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో, స్నేహితుతో కలిసి సరదాగా వుండే గేమ్స్‌ ఆడడం లేదా చల్లగాలికి బయటికి వెళ్లి కాసేపు వాక్‌ చేసి రావడం, మంచి మ్యూజిక్‌ వినడం లాంటివి మీ మెదడుకి, శరీరానికి కూడా ఆహ్లాదాన్ని ఇస్తాయి.
పోటీ తప్పు కాదు – పోలికతోనే ముప్పు :
మనం లక్ష్యాన్ని సాధించటంలో పోటీ అనేది డ్రైవింగ్‌ ఫోర్స్‌లా ఉపయోగపడుతుంది. అయితే అది హెల్దీ కాంపిటీషన్‌ అయి వుండాలి. కాంపిటీషన్‌ వున్నచోట కంపారిజన్‌ కూడా వుంటుంది.
మరికొన్ని టిప్స్‌ :
– పరీక్షల సమయంలో కనీసం ఆరు గంటలు నిద్ర పోవడం చాలా అవసరం.
– మంచి పోషకాహారం తీసుకోవాలి.
– పరీక్షలు ఎండాకాలంలో మొదలవుతాయి. కాబట్టి శరీరం డీహైడ్రేట్‌ అవకుండా ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకుంటూ వుండాలి.
– పరీక్షలు అయ్యేదాకా జంక్‌ ఫుడ్‌కి దూరంగా వుండాలి.
– హాల్‌టికెట్‌ జిరాక్స్‌ తీయించి దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు. అలాగే స్పేర్‌ పెన్స్‌ కూడా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్‌ హాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ముగింపుగా :
– పరీక్షలు మనం ఎదుర్కోలేని సంఘటనలేమీ కాదని గుర్తుంచుకోండి.
– పాజిటివ్‌ థింకింగ్‌ని అలవర్చుకోండి.
– ‘గెలుపు మీదే’ అన్న నమ్మకంతో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్లండి.
ఆల్‌ ద బెస్ట్‌…

– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్‌ సైకాలజిస్ట్‌,
ఫ్యామిలీ కౌన్సిలర్‌

Spread the love