విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో నైరుతి పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయనీ, ఉత్తర పరిమితి తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్‌లో నర్సాపూర్‌ గుండా వెళ్తున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో కర్నాటక, ఏపీ, తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల గురువారం నాడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. వచ్చే మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో బుధవారం రాత్రి పది గంటల వరకు 257 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ మహానగరంలో పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం, రాత్రి సమయాల్లో పలుచోట్ల భారీ వర్షం పడింది. నాంపల్లి, కందికల్‌గేట్‌, చార్మినార్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, భార్కస్‌, తదితర ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. నాంపల్లి జోన్‌లోని బేగంబజార్‌లో అత్యధికంగా 8.58 సెంటీమీటర్ల వర్షం(బుధవారం రాత్రి పది గంటల వరకు) పడింది.

Spread the love