ఆదిలాబాద్‌లో నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు

– పోలీసులు, అధికారులు ఏకకాలంలో దాడి
– రూ.19 లక్షలకు పైగా విలువచేసే ప్యాకెట్లు సీజ్‌
– గోదాం నిర్వాహకుడు సామ అశోక్‌రెడ్డి రిమాండ్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
పట్టణంలోని రాంనగర్‌ పరిధిలో కోజకాలనీకి వెళ్లే మార్గంలోని ఓ గోదాంలో అనుమతి లేకుండా పత్తి విత్తనాలను ప్యాకెట్లుగా తయారుచేస్తున్న గుట్టును శుక్రవారం పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి రట్టు చేశారు. గోదాంలో నిలువ ఉన్న దాదాపు రూ.19 లక్షల 39వేల విలువ చేసే అనుమతిలేని విత్తనాలను వారు స్వాధీనం చేసుకున్నారు. మీనాక్షి సీడ్స్‌ కంపెనీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పత్తివిత్తన కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న అశోక్‌రెడ్డి అనే వ్యక్తి కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు వారి విచారణలో తేలింది. జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో గోదామును తనిఖీ చేయగా విస్తురపోయే నిజాలు బయట పడ్డాయి. సదరు ఉద్యోగి మీనాక్షి అగ్రి సీడ్స్‌ కంపెనీ పేరుతోనే అనుమతులు లేకుండా పత్తి విత్తన ప్యాకెట్లు తయారు చేస్తు మార్కెట్లో సరఫరా చేస్తున్నాడు. మీనాక్షి గోల్డ్‌, పాండురంగ్‌ రకాలతో పాటు పుడమి అగ్రిసీడ్స్‌ పేరుతో పుడమి వైట్కింగ్‌, జె-16 పేర్లతో విత్తన ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటితో పాటు రూ.2లక్షల విలువ చేసే 370 ప్యాకెట్ల జొన్న విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మావల పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు నిందితుడు అశోక్‌ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో రూరల్‌ సీఐ ఫణీందర్‌, మావల ఎస్సై విష్ణు వర్ధన్‌, వ్యవసాయశాఖ అధికారులు శివకుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు..
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ రాంనగర్‌లో ప్రధాన రహదారికి వెనుకగా ఉన్న గోదాములో నకిలీ విత్తన ప్యాకెట్లు తయారుచేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసు అధికారులతో కలిసిదాడులు నిర్వహించామన్నారు. ఈ దాడిలో దాదాపు రూ.19 లక్షల 39 వేల 908 విలువ గల పత్తి, జొన్న విత్తనాలను సీజ్‌ చేశామన్నారు. గోదాం నిర్వహకుడు సామ అశోక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని, నిందితుడితో పాటు అనుమతి లేకుండా ప్యాకింగ్‌ చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఇప్పటికే మండల కేంద్రాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో తనిఖీలు చేపడుతున్నామని తెలియజేశారు. నకిలీ విత్తనాలు విక్రయించే ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇచ్చోడ: నకిలీ బీటీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏఈఓ ఉదరు కిరణ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని బాబ్జిపేట గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన డీలర్‌షాప్‌ వద్దనే కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు చేస్తున్న సమయంలో విత్తన బ్యాగ్‌పై ఉన్న కంపెనీ పేరు, లాట్‌ నెంబర్‌, మానిఫ్యాక్చరింగ్‌, ఎక్స్‌పైరీ తేదీలు, రశీద్‌పై నమోదు చేశాడా లేదా అని పరిశీలించాలి. తీసుకున్న రసీదును తప్పకుండా భద్రపరుచుకోవాలన్నారు. గ్రామంలో నకిలీ బీటీ విత్తనాలు అమ్ముతున్నట్టు అనుమానం కలిగిన వెంటనే సమాచారం అందించాలిని తెలిపారు. ప్రతి సంవత్సరం పంటల మార్పిడితోనే అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. లోతు దుక్కి ద్వార ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. తొందర పడి విత్తనాలు విత్తుకోవద్దని అనుకూలమైన వర్షాలు కురిసిన తరువాతే పంట పొలాలలో విత్తనాలు విత్తుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు దేవురావు, రమేష్‌, మోహన్‌, తుల్సిరామ్‌ పాల్గొన్నారు.
సిరికొండ: రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్‌చార్జీ మండల వ్యవసాయ అధికారి కైలాస్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో విత్తనాల డీలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మండలంలోని విత్తనాల దుకాణాలను మండల తహసీల్దార్‌ విజరు కుమార్‌, ఎస్సై నవీన్‌లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని అన్నారు. లైసెన్స్‌లను కలిగి ఉండాలని అన్నారు. రైతులకు విత్తనాలను విక్రయించే సమయంలో బిల్లులను తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలను విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. దుకాణాల్లో పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్‌, దీపక్‌ పాల్గొన్నారు.
నార్నూర్‌: ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన విత్తనాలను రైతులు వాడాలని, ఎరువుల డీలర్లు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలనీ టాస్క్‌ఫోర్స్‌ అదికారులు ఏఓ దివ్య, తహసీల్దార్‌ విజయనందం సూచించారు. శుక్రవారం గాదిగూడ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చి మోసగిస్తే విత్తన, ఎరువుల దుకాణ యజమానిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా రైతువేదికలో రైతులు వాడాల్సిన వివిధ విత్తనాలపై అవగాహన కల్పించారు. విత్తనాలు ఎరువులు మందులు తీసుకునేటప్పుడు రైతులు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులకు, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఏఈఓలు రైతులు ఉన్నారు.
ఖానాపూర్‌: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై లింబాద్రి , ఏఓ ఆసం రవి అన్నారు. శుక్రవారం ఖానాపూర్‌ పట్టణంలోని వివిధ ఫర్టిలైజర్‌, సీడ్స్‌ దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుగుతూ విత్తన, ఎరువుల దుకాణాల్లోని రికార్డులను పరిశీలించారు.
ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని అంకోలిలో శుక్రవారం రైతు వేదికలో విత్తన డీలర్లకు, రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మాట్లాడారు. రైతులు విత్తనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్లకు రశీదును తీసుకోవాలని అన్నారు. రశీదులో లాట్‌నెంబర్‌, గడువు తేదిని చూసుకోవాలని అన్నారు. ఎవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వ్యవసాయాధికారులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ దిలీప్‌, ఏఓ అశ్రాఫ్‌, ఏఎస్సై సునిత, ఏఈఓలు, రైతులు, డీలర్లలు పాల్గొన్నారు.

Spread the love