నవతెలంగాణ – కంది
తమకు బాకీ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని ఇంద్రకరణ్ ఎస్సె విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… కంది మండలంలోని కలివేముల గ్రామానికి చెందిన ముండేలా అనిల్ 35 సోమవారం గ్రామంలోని కల్లు దుకాణానికి వెళ్ళాడు. అదే గ్రామానికి చెందిన తలారి పాండు, అతని భార్య సునీత అక్కడకు వచ్చి, అనిల్ తమకు ఇవ్వాల్సిన రూ. లక్ష అప్పు గురించి నిలదీశారు.
అనిల్ ప్రస్తుతం తన వద్ద రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పినప్పటికీ, వారు వినకుండా గొడవకు దిగారు. తలారి పాండు కల్లు సీసాతో అనిల్ తలపై బలంగా కొట్టాడు. అనంతరం సునీత తన కొడుకు సందీప్, బావ శేఖర్, అతని కొడుకు వినయ్ అక్కడికి పిలిపించింది. వీరందరూ కలిసి అనిల్ ను చంపాలనే ఉద్దేశ్యంతో కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ, కడుపు, ఛాతిపై తన్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన అనిల్ ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఇంద్రకరణ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



