పంట రుణాల పేర.. రైతుల ఖాతాలు హోల్డ్‌

– చేతికందని పింఛన్‌, పీఎం కిసాన్‌, జొన్నల డబ్బులు
– ఖాతాల్ని హోల్డ్‌ చేయొద్దని లీడ్‌ బ్యాంక్‌ ఆదేశాలు
– పలు బ్యాంకర్ల బేఖాతర్‌..
– టార్గెట్‌ కోసం అప్పులు చెల్లించాలని రైతులపై ఒత్తిడి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘నా పేరు నర్సింహారెడ్డి. మాది వట్‌పల్లి మండలం గొర్రెకల్‌. మంజీరా వికాస బ్యాంకులో రూ.2 లక్షల పంట రుణం ఉంది. ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో అప్పు కట్టలేదు. అందుకని నా ఖాతాను హోల్డ్‌లో పెట్టారు. నాకు ప్రభుత్వం నుంచి నెల నెలా వచ్చే పింఛన్‌ డబ్బులు నా ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ నెల 18న పీఎం కిసాన్‌ డబ్బులు రూ.2 వేలు పడ్డాయి. యాసంగిలో పండించిన 30 క్వింటాళ్ల జొన్నల్ని మార్క్‌ఫెడ్‌ సంస్థకు విక్రయించాను. క్వింటాల్‌కు రూ.3180 చొప్పున ఖాతాలో రూ.95400 జమయయ్యాయి. ఇలా నా ఖాతాలో డబ్బులు జమ అవ్వడం తప్ప వాటిని విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేదు. నా డబ్బులు నేను వాడుకునే వీల్లేదు. ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. అవసరాలకు డబ్బుల్లేక తిప్పలు పడుతున్నం’ ‘నా పేరు నిర్మలబాయి. మాది వట్‌పల్లి మండలంలోని లక్యానాయక్‌ తండా. వట్‌పల్లి మంజీరా వికాస బ్యాంకులో ఖాతా ఉంది. పొలం మీద పంట రుణం తెచ్చుకున్నాం. మాఫీ చేస్తరని చెప్పడంతో కట్టలేదు. అదే బ్యాంక్‌లో బంగారం మీద రూ.2 లక్షల అప్పు తెచ్చుకున్నం. అప్పుకు వడ్డీ కట్టేందుకు బ్యాంకు వెళ్లిన. పంట అప్పు చెల్లిస్తేనే బంగారం అప్పుకు వడ్డీ కట్టుకుంట అని మేనేజర్‌ చెబుతుండు. పంట రుణం మాఫీ అవుతదని కట్టలేదు. ఖాతాను హోల్డ్‌లో పెట్టడం వల్ల బంగారం లోన్‌పై వడ్డీ భారం పడుతుంది’. ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టిన సమస్య వీరిద్దరిదే కాదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కొన్ని బ్యాంకుల్లోని రైతుల పరిస్థితి ఇది. ఖాతాలు హోల్డ్‌లో పెట్టొద్దని పై నుంచి ఆదేశాలున్నా పలుచోట్ల కిందిస్థాయి బ్యాంకర్లు టార్గెట్‌ కోసం పంటరుణాలు చెల్లించాలంటూ రైతులను ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై మరోసారి బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు కోరుతున్నాయి.
వట్‌పల్లి మండలంలో 700 ఖాతాలు హోల్డ్‌
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలోని మంజరీ వికాస బ్యాంకు, ఎస్‌బీఐ, గ్రామీణ వికాస బ్యాంకులున్నాయి. వట్‌పల్లిలోని మంజీరా బ్యాంకులో 9 గ్రామాలకు చెందిన రెండు వేల ఖాతాలుండగా 1200 మందికిపైగానే రైతులు పంట రుణాలు పొందారు. వీరిలో కొందరు అప్పు చెల్లించడం, వడ్డీ కట్టి రెన్యూవల్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వమే అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పడంతో చాలా మంది రైతులు పంట రుణాలు కట్టలేదు. బ్యాంక్‌ మేనేజర్‌.. అప్పులు వసూలు చేయడం కోసం 700 మంది రైతుల ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టి తిప్పలు పెడుతున్నట్టు తెలిసింది. రైతుల్లో చేయూత ఫించన్‌దారులున్నారు. వీరికి నెలకు రూ.2016 బ్యాంక్‌ ఖాతాలో పడుతున్నాయి. జొన్నలు అమ్మిన పైసలు, పీఎం కిసాన్‌ డబ్బులు కూడా విత్‌డ్రా చేసే వీల్లేదు. రైతులు బ్యాంకుకు వెళ్లి అడిగితే మేనేజర్‌ అదంతే.. అప్పు కట్టాల్సిందే అంటూ బెదిరిస్తున్నట్టు సమాచారం. రైతులంతా మండల వ్యవసాయ అధికారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఏఓ బ్యాంకుకు వెళ్లి లీడ్‌ బ్యాంక్‌ సర్క్యులర్‌ చూపినా పట్టించుకోవట్లేదు. మండలంలోని ఎస్‌బీఐ, గ్రామీణ వికాస బ్యాంకు సైతం ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని రైతులు చెబుతున్నారు.
పించన్‌, పీఎం కిసాన్‌, జొన్నల డబ్బులకు బ్రేక్‌
రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మరో పక్క బ్యాంకర్లు మాత్రం రైతుల ముక్కుపిండి అప్పులు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకర్లు పంట రుణాల వసూళ్ల పేరిట రైతుల ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టడం గమనార్హం. ఖాతాలో డబ్బులు జమ కావడం తప్ప విత్‌డ్రా చేసేందుకు వీల్లేదు. అయితే రైతుల్లో కొంత మందికి పింఛన్‌ , పీఎం కిసాన్‌, పంట డబ్బులు వారి ఖాతాల్లో పడుతున్నా వాటిని తీసుకోలేకపోతున్నారు. చాలా మందికి అవి కూడా నిలిచిపోయాయి. తమకు డబ్బులివ్వాల్సిన వాళ్లు ఖాతాలో వేస్తే కూడా ఆగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్‌, కంది, సంగారెడ్డి, పుల్కల్‌, వట్‌పల్లి, రాయికోడ్‌, మనూరు, కంగ్టి, మునిపల్లి, కోహీర్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ వంటి మండలాల్లో రైతుల ఖాతాలు చాలా వరకు హోల్డ్‌లో పడ్డాయి. యాసంగి సీజన్‌లో పండిన జొన్నల్ని మార్క్‌ఫెడ్‌ సంస్థ ద్వారా జిల్లాలో 19 కొనుగోలు కేంద్రాలు పెట్టి 2.18 లక్షల క్వింటాళ్ల జొన్నల్ని కొనుగోలు చేశారు. రూ.69.37 కోట్ల విలువ చేసే జొన్నల్ని కొన్న మార్క్‌ఫెడ్‌ సంస్థ ఇప్పటికే రూ.40 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టడం వల్ల జొన్నల డబ్బులు సైతం చేతికందలేదని తెలిసింది.
ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టొద్దని లీడ్‌ బ్యాంక్‌ ఆదేశాలు
పంట రుణాల్ని సకాలంలో చెల్లించని రైతుల ఖాతాల్ని బ్యాంకర్లు హోల్డ్‌లో పెట్టి అప్పు వసూలు చేస్తున్నారు. బ్యాంకర్ల నిర్ణయం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో లీడ్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకుంది. పంట రుణాల వసూలు కోసం రైతుల ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టకూడదంటూ అన్ని రకాల బ్యాంకర్లకు లీడ్‌ బ్యాంక్‌ నుంచి ఆదేశాలు జారీ చేశారు. సదరు కాపీని ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, ఇతర బ్యాంకులన్నింటికీ పంపారు. అయినా బ్యాంకు మేనేజర్లు అప్పుల రికవరీ టార్గెట్‌ను చేరుకోవడం కోసం రైతుల ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టి అందులో జమైన డబ్బుల్ని అప్పు కింద కట్టించుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు లీడ్‌ బ్యాంకు ఆదేశాల్ని పాటించాలని చెబుతున్నా ఫలితముండట్లేదు.
రైతు ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టొద్దు: ఎ.మాణిక్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
రైతుల ఖాతాల్ని హోల్డ్‌లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం 2018 డిసెంబర్‌ నుంచి 2023 వరకు ఉన్న రూ.2 లక్షల పంట రుణాల్ని మాఫీ చేస్తామంటుంది. ఎన్నికలప్పుడే రుణాల్ని ఎవరూ కట్టొద్దని చెప్పారు. అందుకే రైతులు చెల్లించలేదు. బ్యాంకర్లు మాత్రం హోల్డ్‌లో పెట్టి ఫించన్‌ డబ్బులు, జొన్నలమ్మిన డబ్బులు, పీఎం కిసాన్‌ డబ్బుల్ని ఆపారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల సమస్యను పరిష్కరించాలి.

Spread the love