నవతెలంగాణ-పర్వతగిరి
వర్షాలు లేక రెండుసార్లు విత్తనాలు నాటినా మొలకెత్తకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా వర్ధన్నపేట మండలంలోని గుబ్బేటి తండాకు చెందిన బానోతు కములమ్మ(35) భర్త రాంధన్లు తిర్మలాయపల్లి శివారులో గత నాలుగేండ్లుగా 9 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా 20 రోజుల కిందట పత్తి గింజలు నాటారు. వర్షాలు లేక మొలకెత్తకపోవడంతో మళ్ళీ రెండోసారి పెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శనివారం కమలమ్మ పురుగుల మందు తాగింది. దాంతో భర్త రాందన్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం పరిస్థితి విషమించి మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ద్వారా మృతురాలి కుటుంబానికి సాయం అందించాలని స్థానిక తండా వాసులు కోరుతున్నారు.