నవతెలంగాణ – తాడ్వాయి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఉత్తమ పథకాలను ప్రవేశపెడుతున్న సందర్భంగా గురువారం మండలంలోని మేడారం, తాడ్వాయి, అంకంపల్లి, గంగారం గ్రామాలలో అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్లల్లోకి వెళ్లి ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అనే సంక్షేమ పథకాలను పేద ప్రజలకు సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వమే నేరుగా ప్రజల వద్దకు చేరుకొని ఇల్లు తిరిగి సర్వే నిర్వహించి లబ్ధిదారుల జాబితా తయారీ ప్రక్రియ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి నల్లెల శ్రీధర్ అధికారులు మండల కేంద్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఫీల్డ్ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను సూచించారు. సర్వే ద్వారా రైతులు పేద కుటుంబాలు ఇండ్లకు నోచుకోని పేదలు వంటి లబ్ధిదారులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. గ్రామ సభల సమయంలో ప్రజలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ ఓంటేరు దేవరాజ్, తాడ్వాయి, మేడారం, అంకంపల్లి, గంగారం గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్న రెవిన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.