న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యూ) చైర్‌పర్సన్ రేఖాశర్మపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసారనే అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట ప్రాంతం సందర్శనకు వచ్చిన రేఖాశర్మపై ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. రేఖాశర్మకు ఇతరులు గొడుగు పట్టుకోవడం ఉన్న వీడియోను ఉద్దేశిస్తూ.. రేఖాశర్మ తన గొడుగును ఎందుకు పట్టుకోలేదని కొంత మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ ‘ఆమె (రేఖాశర్మ) చేతులు తన బాస్ పైజామాను పట్టుకోవడంలో బిజీగా ఉన్నాయి’ అని ఎంపీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈ నెల 5న ఢిల్లీ పోలీసులకు ఎన్‌సీడబ్ల్యూ ఫిర్యాదు చేసింది. అలాగే చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ పంపింది. ‘మొయిత్రా వ్యాఖ్యలు అవమానకరమైనవి. పరువునష్టం కలిగించేవి’ అని కమిషన్ ఒక ప్రకటనలో విమర్శించింది. బిజెపి కూడా ఈ వ్యాఖ్యలపై దాడికి దిగింది. టీఎంసీ నుంచి మెయిత్రాను ‘బర్తరఫ్’ చేయాలని డిమాండ్ చేసింది.