తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

నవతెలంగాణ న్యూఢిల్లీ: తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో మూడు కోచ్‌లు దగ్ధమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 4.20 గంటల సమయంలో తుగ్లకాబాద్, ఓఖ్లా మధ్య నడిచే తాజ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మంటలు రాజుకున్నాయి. మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. దీంతో ఆగ్నేయ ఢిల్లీలోని సరితా విహార్‌ ప్రాంతంలో ఆ రైలును నిలిపివేశారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
తాజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చెలరేగిన మంటలను ఫైర్‌ సిబ్బంది ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో డి3, డి4 కోచ్‌లు పూర్తిగా కాలిపోయినట్లు ఢిల్లీ ఫైర్‌ అధికారి తెలిపారు. డి2 కోచ్‌ పాక్షికంగా దగ్ధమైందని చెప్పారు. మరోవైపు మంటలు చెలరేగిన బోగిల్లోని ప్రయాణికులు త్వరగా ఇతర కోచ్‌లకు వెళ్లారని పోలీసులు తెలిపారు. రైలు ఆగడంతో ప్రయాణికులంతా కిందకు దిగినట్టు చెప్పారు. దీంతో ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఏమీ జరుగలేదని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love