నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలోని ఇడుక్కి జిల్లాలో గురువారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిపోయింది. పంపనార్ ప్రాంతానికి చెందిన ఆగ్నల్‌కు చెందిన ఐదు అంతస్తుల భవనం ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో కార్మికులు లేదా ఇతరులు ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.
సమాచారం ప్రకారం, భవనం దిగువ మూడు అంతస్తుల వరకు మాత్రమే పిల్లర్లు, బీమ్‌లు నిర్మించగా, పై రెండు అంతస్తులను కాస్టింగ్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. జాతీయ రహదారికి అవసరమైన దూరం పాటించేందుకు భవనం పక్కన రాతి కట్ట నిర్మించి, దానిని మట్టితో నింపారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ మట్టి దిబ్బలోకి పెద్ద మొత్తంలో నీరు చేరి, దాని బరువు పెరగడంతో అది భవనంపై ఒత్తిడి తెచ్చి కూలిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అలాగే నిర్మాణంలో లోపాలు కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. సమీపంలోని ఇతర భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.



