ఆహారం – ఆరోగ్యం ‘ఆలూ’ ది బెస్ట్‌!!

Food - Health 'Aloo' The Best!!పొటాటో అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా లభ్యమయ్యే వెజిటబుల్‌. సొలనుమ్‌ ట్యుబేరోసం అనే శాస్త్రీయ నామం కలిగిన అందవికారమైన కందమూలలో బంగాళాదుంప ఒకటి. దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఉల్లగడ్డ అంటారు. మరికొన్ని ప్రాంతాలలో ఆలుగడ్డ అని, ఇంకొన్ని ప్రాంతాలలో బంగాళా దుంప అంటారు. బంగాళా దుంపను ఏ రకమైన కూరగాయలతోనైనా కలిపి వంట చేయొచ్చు. దీనిని ఉర్లగడ్డ అని కూడా అంటారు. ఆలుగడ్డలో శరీరానికి కావలసిన కాల్షియం, ఇనుము, విటమిన్‌-బి, ఫాస్ఫరస్‌లు ఉంటాయి.
బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది. బంగాళదుంపలను తినటం వలన రక్తపీడనం తగ్గవచ్చని ‘పెన్సిల్వేనియా బెసిడ్‌ ఆన్‌ స్క్రాన్టన్‌ యూనివర్సిటీ’ పరిశోధకులు సూచించారు. ఊబకాయులు, అధిక బరువు ఉండే వారికి రోజు రెండు సార్లు కూరగాయలను తినిపించటం ద్వారా శరీర బరువు తగ్గించవచ్చు. ఎక్కువ న్యూట్రీషియన్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉన్నాయి. రోగులకి, పిల్లలకి ఇంకా అరుగుదల సమస్య ఉన్న వాళ్ళకి ఇవి మంచి ఆహారం. ఇవి శక్తి ని కూడా అందిస్తాయి. చాలామంది వేయించిన ఆలుగడ్డ కూర అంటే బాగా ఇష్టపడతారు. శరీరానికి ఎలాంటి కాలరీలు అందించవు కానీ కొవ్వు పదార్థాలు మాత్రం పుష్కలంగా అందించబడి, అనారోగ్యాలను కలిగిస్తాయి.
ఒక బంగాళదుంప 110 కాలరీలను, డజన్‌ ఫైటో కెమికల్‌, విటమిన్‌ లను కలిగి ఉంటుంది. 18 మంది ఊబకాయులకు 4 వారాల పాటు ఊదారంగు బంగాళదుంపను అందించారు. పరిశోధనలు జరిపిన 18 మంది రక్తపోటు స్థాయిలు తగ్గాయని కనుగొన్నారు.
కార్బోహైడ్రేట్స్‌ కలిగినందువల్ల బంగాళా దుంపలు తేలికగా అరిగిపోతాయి. శక్తిని కూడా అందిస్తాయి. విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియంలు బంగాళాదుంపలలో లభ్యం అవడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ దుంపలు ఉడికించిన నీళ్ళు కీళ్ళ నొప్పులకు బాగా పని చేస్తుంది. పిండి పదార్ధం అధికంగా ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
విరేచనాలతో బాధపడే వారికి త్వరగా శక్తి నిచ్చేది బంగాళాదుంపలే. పీచు పదార్ధం కలిగి తేలికగా అరుగుతుంది. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అరుగుదలలో ఇబ్బంది కలిగి మరలా విరేచనాలు పట్టుకోవచ్చు.
‘పెన్సిల్వేనియా బెసిడ్‌ ఆన్‌ స్క్రాన్టన్‌ యూనివర్సిటీ’ పరిశోధనల ప్రకారం ఊదా రంగు బంగాళదుంపను ఎలాంటి నూనె, కొవ్వు పదార్థాలు కలపకుండా, కేవలం మైక్రోవేవ్‌లో వండితే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. కాల్చి, ఉడికించి లేదా ఆవిరితో తయారుచేసి తినటం వలన మంచి ఫలితాలు పొందుతారు. బంగాళా దుంపను ఆహారంలో తీసుకుంటే శరీరంలోని రక్తనాళాలు ఎక్కువ రోజులపాటు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని పాలలో కలిపి సేవించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కార్బోహైడ్రేట్లను తినేటప్పుడు, శరీరం దాన్ని గ్లూకోజ్‌ అనే సాధారణ చక్కెరగా మారుస్తుంది. గ్లూకోజ్‌ అణువులు రక్తప్రవాహంలోకి ప్రవేశించి మన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తికి శరీరంలో తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది గ్లూకోజ్‌ కణాలలోకి ప్రవేశించడానికి, శక్తిగా వినియోగించటానికి అనుమతిస్తుంది. డయాబెటిస్‌ ఎక్కువ ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయనందున, గ్లూకోజ్‌ అణువులు కణంలోకి ప్రవేశించి రక్తంలో ఉండటంలో విఫలమవుతాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
దుంపల్లోని కార్బోహైడ్రేట్స్‌ నియంత్రించడానికి బీన్స్‌ వంటి అధిక ఫైబర్‌ కూరగాయలతో కూడా ఉడికించాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఆహార పదార్థాలలో బంగాళదుంపను తీసుకోవడం వలన రక్తపోటు తగ్గుతుంది. బంగాళ దుంపలో ఫైటోకెమికల్స్‌, విటమిన్లు ఉన్నాయి. విటమిన్‌ సి, బి కాంప్లెక్స్‌ ఇంకా పొటాషియం, మెగ్నీషియం, పొస్ఫరస్‌, జింక్‌ వంటి మినరల్స్‌ కలిగినందువల్ల ఆలుగడ్డలు చర్మ సంరక్షణకు మంచివి.
విటమిన్‌ సి, పొటాషియం, విటమిన్‌ బి 6 లు అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థలో ఇంకా ప్రేగులలో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. నోటి అల్సర్‌ ఉన్న వాళ్ళకు ఇది మంచి ఆహారం. పచ్చి పొటాటో ముద్దని కాలిన గాయాలకి రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
విటమిన్లు, మినరల్స్‌ ఇంకా పీచు పదార్ధాలతో పాటు బంగాళా దుంపలలో కార్బోహైడ్రేట్స్‌ కూడా ఉంటాయి. ఇవి రక్తంలోని గ్లూకోస్‌ స్థాయిలని పెంచడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు తలెత్తవచ్చు. గుండెపై ఒత్తిడి కలిగించవచ్చు. ఊబకాయంతో బాధపడే వాళ్ళకి ఆలుగడ్డ మంచిది కాదు.
స్కిన్‌ ట్యాన్‌, బ్లేమిషెస్‌, డ్రై స్కిన్‌ వంటి కొన్ని స్కిన్‌ ప్రాబ్లెమ్స్‌ ఈ మధ్యకాలంలో సాధారణంగా మారిపోయాయి. ఇటువంటివాటికి ఆల్‌ ఇన్‌ వన్‌ సొల్యూషన్‌గా పొటాటోని పేర్కొనవచ్చు. ఆలుగడ్డరసం కాలిన గాయాలకి, చర్మ సమస్యలకి, బెణుకులకి ఔషధంలా ఉపయోగపడుతుంది. కాలిఫ్లవర్‌, బంగాళదుంప, ఉల్లిగడ్డలకు ఉదర క్యాన్సర్లను రాకుండా అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లు చైనాలోని జిజియాంగ్‌ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ప్రొస్ట్రేట్‌ కాన్సర్‌, గర్భాశయం ఇంకా కొన్ని కణితులకి ఇది బాగా పనిచేస్తుంది.
పొటాటోలో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని కాంతి వంతంగా మార్చేందుకు తోడ్పడతాయి. ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవడం ద్వారా కోమలమైన ఆరోగ్యవంత మైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
కొందరిలో పుల్లటి తేపులు వస్తుంటాయి. అలాంటి వారి శరీరంలో ఎక్కువ వాయువు చేరుకుంటుంది. ఇలాంటి వారు దుంపలను వేడి-వేడి బూడిద లేదా ఇసుకలో వేంచుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అమెరికాలో ప్రతి ఏడాది బంగాళాదుంపతో చేసిన ఫ్రెంచ్‌ఫ్రైస్‌ 40 లక్షల టన్నులు అమ్ముడవుతున్నాయి. ఒక అమెరికన్‌ ఏడాదికి 70 కిలోల దుంపల్ని తింటే, జర్మన్‌ 100 కిలోలు తింటాడని అంచనా. 1995లో కొలంబియా నౌకలో వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువ పండిస్తున్నది చైనా. ఆ తరువాతి రెండు స్థానాల్లో రష్యా, ఇండియాలు ఉన్నాయి.
చర్మం నల్లగా.. కమిలినట్లు అనిపిస్తే ఆలుగడ్డ గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆలుగడ్డ రసంతో ముఖాన్ని కడుక్కుంటే ముడతలు తగ్గుతాయి. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి ఆలుగడ్డ రసాన్ని రాస్తే చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆలుగడ్డ గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి మాస్క్‌ వేసి, పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముడతలు పోతాయి.
ఆలుగడ్డ గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి, ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మదువుగా, తెల్లగా అవుతుంది. ఆలుగడ్డ రసంలో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగితే చర్మం రంగు తేలుతుంది.
ఆలుగడ్డ పేస్ట్‌ లో కొద్దిగా కీరదోస రసం కలిపి ముఖానికి పట్టించడం వల్ల టోనర్‌ గా పనిచేస్తుంది.
ఆలుగడ్డ రసంలో కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు మెరుస్తుంది. అలాగే ఆలుగడ్డ తొక్కని నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లతో తలస్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు కూడా తగ్గుతాయి. ఆలుగడ్డను గుండ్రంగా కోసి ముఖంపై మర్దనా చేస్తే ట్యాన్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834

Spread the love