విద్య తటస్థంగా ఉండాలి : హంటర్‌ కమిషన్‌కు చెప్పిన ఫూలే

విద్య తటస్థంగా ఉండాలి : హంటర్‌ కమిషన్‌కు చెప్పిన ఫూలేనేడు మహాత్మా జ్యోతి రావు ఫూలే 133వ వర్థంతి, శూద్ర అతిశూద్ర కులాలకు విద్యనందించడంలో దేశంలో మొదటి అడుగేసిన వారు ఫూలే దంపతులు. పూనా నగరంలో అనేక స్కూళ్లను వారు నెలకొల్పి నడిపారు. శూద్రులకు, అతిశూద్రులకు చదువు చెప్పి మత సాంప్రదాయాలను మట్టిపాలు చేస్తూన్నారంటు ఛాందసులు చేసిన, చేయించిన దాడులకు వారు గురయ్యారు.ఆయినప్పటికీ వెరపు లేకుండా తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. పాఠశాలలు నెలకొల్పడమే కాదు. ఎలాంటి విద్యనందించాలి అన్న విషయం పై ఫూలేకు నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. చరిత్ర పాఠ్యాంశాల్లోకి పురాణాలను చేర్చాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో మహాత్మా జోతిరావు ఫూలే (సాధారణ జనం జ్యోతి అని పిలవరు కనుక తన పేరును జ్యోతిరావు గానే ఆయన రాసుకొన్నారు) ఏమి చెప్పారో చూద్దాం.
భారత దేశంలో ఎలాంటి విద్యను అందించాలో నిర్ధారించుకోవడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం 1881లో సర్‌ విలియం హంటర్‌ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌కు ఫూలే వివరమైన నోట్‌ను రాత పూర్వకంగా సమర్పించారు. అందులో అనేక అంశాలతో పాటు విద్యను తటస్థంగా ఉంచాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం వివిధ జాతులు, మతాలు ఉన్న దేశం కనుక విద్యారంగంలో మతపరమైన తటస్థత ఎంతో అవసరమని అన్నారు.
దానికి ముందు ఆయన తన ప్రఖ్యాత పుస్తకంలో ఏ ప్రమాదం గురించి హెచ్చరించారో ఆ ప్రమాదం ఈరోజు దేశ ప్రజల తలలపై కత్తిలా వేలాడుతోంది. ఫూలే దశావతారాలు, పురాణాలు కట్టుకథలని తేల్చిచెప్పారు. ఆ కట్టుకథలే ఇప్పుడు చరిత్ర పాఠాల్లోకి ఎక్కి, రాబోయే తరానికి చారిత్రక వాస్తవాలుగా పరిచయం కానున్నాయి. దశావతారాల్లో భాగంగానే రామాయణ భారతాలను చూపెడ్తారు. ఆ దశావతారాలు అర్థం పర్థం లేనివని ఫూలె చీల్చి చెండాడారు. కాగా ఆ పురాణాలను పాఠశాలల పిల్లలకు అది కూడా చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి(ఎన్‌సిఇఆర్‌టి), సిఫారసు చేసింది. ప్రభుత్వ సూచనపైనే ఆ సిఫారసు చేసి ఉంటుంది. కనుక అది తప్పక అమల్లోకి వస్తుంది!
రామాయణ, మహాభారతాలను కావ్యాలుగా చదువుకోవడం, వాటిలోని పనికొచ్చే నీతిని అనుసరించడం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండనవసరంలేదు. కాని వాటిని చరిత్రలో భాగాలని చెప్పడమంటే శాపాలు, మాయలు మంత్రాలు, అస్త్రాలు, రాక్షసులు, కామరూపాలు, పది తలలు, స్వర్గానికి నిచ్చెన వేయడం, చెవుల ద్వారా పిల్లలు కనడం, ఒకేసారి నూటొక్క సంతానానికి జన్మనివ్వడం వగైరా వగైరాలన్నీ చరిత్రలో ఏదో ఒక దశలో జరిగినట్లు అనుకోవాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా యుగవిభజనను మార్చాలని కూడా చెప్పడం మరో దారుణం. రామాయణ, మహాభారత కాలాలను క్లాసికల్‌ యుగాలుగా పేర్కొనాలని ఎన్‌సిఈఆర్‌టి చెప్పింది. మున్ముందు యుగ విభజనను కూడా మార్చేసి ప్రపంచానికి నాలుగు యుగాలున్నాయని, అవే కృత యుగం, తేత్రా యుగం, ద్వాపర యుగం కలియుగమంటూ చరిత్ర క్లాసులు చెప్పాలంటూ శాసించవచ్చు.
మొఘల్‌ పాలనను చరిత్ర నుండి తొలగించినట్లుగానే హరప్పా మోహంజదారో తవ్వకాలను, సింధూ నాగరికతను చరిత్ర పాఠాల్లో వివిధ చారిత్రక పరిశోధనలు ఇక కన్పించకపోవచ్చు. వేల ఏళ్లక్రితమే మనకు విమానాలున్నాయని, ప్లాస్టిక్‌ సర్జన్లు ఉన్నారని, మాట్లాడే పక్షులు, సమాద్రాన్ని ఒక ఉదుటన లంఘించే జలశాలులు ఉన్నారని చెప్పే విశ్వగురువుల కాలంలో ఏదైనా జరగొచ్చు. గుర్రం ఎగరనూ వచ్చన్నమాట. అవతారాల కల్పనను పూలేకు ముందు కూడా తప్పుబట్టిన వారున్నారు. ఫూలే దాన్ని తప్పుబట్టడానికి ప్రధాన కారణం సింపుల్‌ దేవుడి చేత మనుషులు అసమానులుగానే సృష్టించబడ్డారన్న మనువాద సిద్ధాంతాన్ని ధ్వంసం చేసి మానవులందరూ సమానులేనన్న చెప్పడమే ఫూలే లక్ష్యం. పురాణాలన్నీ చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తాయి. రామాయణంలోని శంబూక వథ చెప్పే నీతి ఏమిటి? ఒక వర్ణానికి దేవుడు నిర్దేశించిన పనిని మరొక వర్ణం వాడు చేయదల్చితే వారిని శిక్షించడం రాజధర్మం అది ధర్మమే అనుకొంటే మన చట్టాలను, రాజ్యాంగాన్ని మార్చుకోవలసి వస్తుంది.
కర్మ ఫలాన్ని బట్టి పేద, ధనిక తారతమ్యం ఉంటుందని పురాణాలు చెప్తాయి.ఆ కర్మఫలాన్ని మార్చే అధికారం మనిషికి లేదు కనుక అన్ని సంక్షేమ పథకాలకు మోడీ తరహా ప్రభుత్వాలు సెలవుచీటి కూడా ఫ్రెంచి విప్లవానికి ముందు ఫ్రాన్స్‌లో ఇవ్వొచ్చు. పన్నులు చెల్లించేవారు కాదు. రైతులు, వ్యాపారులు మాత్రమే పన్నులు కట్టే వారు. రాజ వంశీకులు మనదేశంలో కూడా మనుషులు సత్కర్మల వల్ల ధనికులుగా పుడతారని పురాణాలు చెప్తున్నాయి గనుక ధనికులను పన్నుల నుండి ప్రభుత్వాలు మినహాయించవచ్చు. మోతెబరు కంపెనీలకు అప్పుల రద్దుతో ఇప్పుడు జరుతోంది. పూర్వజన్మలో సత్కర్మలు చేయనందు వల్ల శూద్రులుగా పుట్టిన వారు మాత్రమే ప్రభుత్వ నిర్వహణకు,పెద్దల భోగవిలాసాలకు పన్నులు చెల్లించాలని పన్ను చట్టాల్లో మార్పులు చేయవచ్చు. శూద్రులకు అతిశూద్రులకు ఇస్తున్న రిజర్వేషన్లకు ఎప్పుడెప్పుడు మంగళం పాడవచ్చు.
దశరథునికి ఒక కూతురు ఉన్నా పుత్రకామేష్టి యాగం చేసి పుత్రసంతానం పొందాడు. స్త్రీలు రెండవ తరగతి పౌరులట కనుక వారు తమ తండ్రులకు సద్గతిని కల్పించలేరట. రామాయణం ఎలాంటి దాపరికం లేకుండా ఈ విషయం చెప్తుంది. ఫూలే రాసిన చివరి పుస్తకం ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తక్‌’ను తన జీవితపు చివరి దశలో పక్షవాతంతో కుడికాలు, కుడిచెయ్యి పడిపోగా ఎడమ చేతితో రాసి పూర్తి చేశారు. పుస్తకం ముద్రణకు వెళ్లకముందే ఆయన మరణించారు. 1890 నవంబర్‌ 28న చనిపోయారు. పురాణాలు పురుషాధిక్యతకు పెద్దపీట వేస్తాయి. దానికి పూర్తి విరుద్ధం ఫూలే. సృష్టిలో ఆడ, మగల్లో ఏది ఉన్నతం అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ స్త్రీయే ఉన్నతమని ‘సత్యధర్మ’ లో సమాధానమిచ్చారు.
దేవుడి ఉనికిపై ఆయనకు సమాధానం లభించని ప్రశ్నలు ఎన్నో సత్యధర్మలో ఉన్నాయి. వాటిని సత్యధర్మలో కూడా ప్రస్తావించాయి. ‘గులాంగిరి’ ముగింపులోని ప్రధాన ప్రశ్నను కూడా లేవనెత్తారు. సమస్త విశ్వాన్ని సృష్టించిన దేవుడే మనిషినీ సృష్టించాడు. దేవుడు దయామయుడు కనుక ఆయన సృష్టిలోని అన్ని హక్కులనూ, సంతోషాలనూ మనుషులందరూ అనుభవించాలి. కాని అలాలేదు ఎందుచేత? అని ఫూలే తనను ప్రంపచం తాను ప్రశ్నించుకొన్నారు. ఏ మతగ్రంధమూ సార్వజనీన సత్యాన్ని చెప్పలేదని ఆయన సత్యధర్మ పుస్తకం ఆరంభలోనే చెప్పారు.
వివిధ దేశాల్లో ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకొంటూ ఎందుకు బతుకుతున్నారు? మతి మాలిన మత విద్వేషాలు ఎందుకు? భూమ్మీద ఉన్న నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. అలాంటప్పుడు ఒక్కనదినే పవిత్ర నదిగా ఎలా భావిస్తారు? ఆ పవిత్రనది తన వెంట కుక్కమలాన్ని తీసుకువెళ్లడానికి నిరాకరిస్తుందా? అంటూ హేతుబద్ద ప్రశ్నలను ఫూలే లేవనెత్తారు. అలాగే ఈ భూమి మీద పుట్టిన మనుషులందరికీ ఒకే రకమైన భౌతిక, మేదోపరమైన లక్షణాలుంటాయి. అలాంటప్పుడు కొందరు మాత్రమే తరతరాలుగా పవిత్రులు ఎలా అవుతారు. వారూ ఇతరుల్లాగే మరణించడం లేదా? వారిలోనూ మంచీ చెడు లక్షణాలు లేవా? అని ప్రశ్నించారు.
స్వర్గం అన్న భావనను కూడా ఫూలే వదలిపెట్టలేదు. పురాతన సమాజంలో కొందరు తెలివిమంతులు స్వర్గాన్ని సృష్టించుకొన్నారు. పొలంలో దిష్టిబొమ్మను పెట్టి కాకులను పారదోలినట్లు స్వర్గాన్ని సృష్టించారు. తదనంతర కాలంలో చాలా మార్పులు జరిగాయి. అయినా స్వర్గం ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే స్వర్గం, నరకం నిస్సందేహంగా లేవు. అని ఫూలే ధృడంగా చెప్పారు. మరి మన పురాణాల నిండా ఉన్నవి సర్గనరకాలే కాదా? అలాంటి పురాణాలకు మోడీ ప్రభుత్వం చరిత్ర పేరుతో శాస్త్రీయతను అద్ది మత ఛాందసాన్ని తన రాజకీయ లాభం కోసం మార్కెట్‌ చేయాలని అనుకొంటోంది. పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న వేళ పనిగట్టుకొనే ఎన్‌సిఈఆర్‌టి చేత ఆ సిఫారసు చేయించింది.
వర్ణాశ్రమ ధర్మంపై ఫూలే దాడి సునిశితంగా ఉంటుంది. దేవుడు- మనుషుల్ని నాలుగు వర్ణాలుగా సృష్టించి ఉంటే ఆ పని మిగతా జీవజాలంలో ఎందుకు చేయలేదు? గాడిదలు, కాకులు వంటి జీవరాసుల్లో ఫలానా అవి బ్రాహ్మణ గాడిదలని, అవి బ్రాహ్మణ కాకులని ఎవరైనా చెప్పగలరా? అని సత్యధర్మలో అని ప్రశ్నించారు. అపరిశుభ్ర పని చేసేవాడు తక్కువ కులం వాడన్న వాదనను కూడా ఆయన కొట్టేశారు. అలా అయితే చిన్న తనంలో తన పిల్లల మల, మూత్రాలను శుభ్రం చేసే తల్లి కూడా తక్కువ కులం కావాలి గదా? అని అడిగారు. బాల బాలికందరికీ పన్నెండేళ్ల వయసు వరకు నిర్బంద ఉచిత విద్యనందించాలని కోరారు.
”అనేక జాతులు, మతాలు కలిగిన ఈ దేశంలో విద్య తటస్థంగా ఉండడమే కాదు విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఫూలే సూచించారు. ప్రభుత్వ విద్యారంగం నుండి ఉపసంహరించుకుంటే విద్యను తటస్థంగా ఉంచాలన్న ప్రభుత్వ (బ్రిటిష్‌) లక్ష్యం దెబ్బతింటుంది” అని చెప్పారు. ఇప్పుడు దేశంలో ప్రయివేటు స్కూళ్లదే రాజ్యమైనా పాఠశాల విద్యా బోర్డులు, ఎన్‌సిఈఆర్‌టి లాంటివి తటస్థ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆ తటస్థ విధానం స్థానలో మత ఛాందసాలను ప్రవేశపెడితే గంగోత్రి దగ్గరే గంగను కలుషితం చేసినట్లు అవుతుంది. భారతదేశన్ని మళ్లీ మధ్య యుగాల్లోకి తీసుకెళ్లడానికే మోడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు విస్పష్టంగానే కన్పిస్తుంది.
ఎస్‌. వినయ కుమార్‌
9989718311

Spread the love