ఓటమి గెలుపుకు పునాది: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

నవతెలంగాణ – తుంగతుర్తి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ, గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని, కార్యకర్తలు కృంగిపోవద్దని, ఓటమి గెలుపునకు పునాది అని అన్నారు. రానున్న లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి, భారత రాష్ట్ర సమితి సత్తా ఏమిటో తెలియజేయాలని అన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో కల్లబొల్లి మాటలు చెప్పి, గారడి చేసి ప్రజలను మభ్యపరిచి, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం అహర్నిశలు కృషిచేసిన కేసిఆర్ ను ఇష్టానురీతిగా, అసభ్యంగా, మాటలతో దూషణలకు దిగుతున్నారని అన్నారు. కేసిఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ఓడినా, గెలిచినా, రాష్ట్ర సంక్షేమమే తన ఆత్మగా జీవిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల మధ్య ప్రాణం విడుస్తా తప్ప, వెనుకడుగు వేసేది లేదని భీష్మించి కూర్చున్నాడని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు సైతం అధికార దాహంతో వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు రూ.4000 వరకు పెంచుతామని చెప్పి, ఇంతవరకు వాటిని అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు, తాము వెంటపడి వారిని నిలదీస్తామని అన్నారు. అధికారం ఎప్పటికీ, ఎవరికీ శాశ్వతం కాదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వారు గుర్తు చేసుకోవాలని సూచించారు. మోసాన్ని మోసంతోనే జయించాలని,  సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు తీవ్ర వ్యతిరేకత భావం ఏర్పడిందని, ఇది పోరాటాల గడ్డ అని, రాష్ట్రంలో ఇకనుండి వచ్చే ప్రతి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ సైనికులు పనిచేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగినా, వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోయినప్పుడే మనం అనుకున్న స్థానాన్ని చేరవచ్చు అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాలేదని, ఎవరూ అధైర్య పడవద్దని, తాము కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,రాష్ట్ర మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఒంటెద్దు నరసింహారెడ్డి,రాష్ట్ర మాజీ ఆయిల్ షెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి,గుజ్జ యుగంధర్ రావు,ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్, కందాల దామోదర్ రెడ్డి తో పాటు వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love