తెలంగాణ దర్శినిలో లక్ష మంది విద్యార్థులకు ఉచిత టూర్‌

– మార్గదర్శకాల విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టూరిజం ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ దర్శిని టూర్‌ ప్రోగ్రామ్‌లో లక్ష మంది విద్యార్థులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబందించి జీవో నెంబర్‌ 280ని టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్‌ ఆదివారం జారీ చేశారు. రెండవ తరగతి నుంచి డిగ్రీ, ఆపై చదివే విద్యార్థులు పర్యాటక టూర్‌కు అర్హులు. ఇందులో విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరిలో 2నుంచి 4వతరగతి విద్యార్థులు (డేట్రిప) రెండవ కేటగిరీలో 5 నుంచి 8వతరగతి విద్యార్థులు (20 నుంచి 30 కిలోమీటర్లు, సొంత జిల్లాలో (డేట్రిప)్‌, మూడవ కేటగిరీలో 9 నుంచి ఇంటర్‌ విద్యార్థులు (50 నుంచి 70 కిలోమీటర్లు రెండు రోజులు), నాల్గవ కేటగిరీలో డిగ్రీ అపై విద్యార్థులు, రాష్ట్రంలో ఎక్కడికైనా,నాలుగు రోజులు) ఉచితంగా వెళ్లడానికి టూర్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. కేటగిరీల వారీగా వరుసగా రూ.300, రూ.800, రూ.2,000, రూ.4,000 వ్యయం అవుతుందని ఖరారు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎన్విరాల్‌మెంట్‌ ఫారెస్ట్‌ సైన్స్‌ లేదా ఇతర సంస్థలు విద్యార్థుల వ్యయాన్ని భరించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నోడల్‌ అధికారులను ఏర్పాటు చేయనున్నారు. రవాణా, విద్యార్థుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లను ఉపాద్యాయులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల మార్గదర్శకత్వంలో చూసుకోవాలని సూచించారు. తెలంగాణ దర్శిని కార్యక్రమానికి టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ కన్వినర్‌గా వ్యవహరించనున్నారు.

Spread the love