ముఖపుస్తకం
పొంగి పొర్లుతుంది
స్నేహ అభ్యర్థనలతో
అంతా ఖండాంతర వాసులు
నిజముఖాలో
ముసుగుముఖాలో
స్త్రీలింగాలో
పుంలింగాలో
నీరులా కనిపించే నేలో
నేలలా అనిపించే నీరో
నిజాలో, మరీచికలో
క్రాంతో, భ్రాంతో
మిత్రత్వమో, శత్రుత్వమో
మోహం కలిగించే మోములు
ఇష్టం పెంచే ముఖాలు
ఆకర్షణల వలలు విసురుతూ
అజ్ఞాతనది
అడుగున మింగేసే మడుగులెన్నో
ఒడ్డు చేర్చే పడవలెన్నో
అభ్యర్థన అంగీకరించాలా
తృణీకరించాలా
భౌతిక బంధాల గాలిపటం
దారం తెగిపోయాక
తెరల బంధాలకు తెరలేపాలా..?
ఇప్పుడు సమూహాలన్నీ
ఆ నడిసముద్రం లోతుల్లోనే
సేదతీరుతున్నాయి
కొత్త అభ్యర్థన
ఒప్పుకుందామన్నా ఇక
కుదరదంటూ గీత గీసింది
దాట వద్దంటూ సైగ చేసింది
సాంఘిక మాధ్యమ మాయాదీవి..!
– డా||పెరుగు రామకృష్ణ,
9849230443