నవతెలంగాణ- తుంగతుర్తి: తుంగతుర్తి ఎమ్మెల్యేగా గాదరి కిషోర్ కుమార్ ను మరోసారి ఆశీర్వదించి గెలిపించినట్లయితే నియోజకవర్గం అభివృద్ధి పథంలో కొనసాగుతుందని మండల పరిధిలోని అన్నారం గ్రామ ఎంపీటీసీ వంటల కృష్ణ అన్నారు. బుధవారం అన్నారం గ్రామంలో గడపగడపకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఓట్ల కోసం వచ్చే నాయకులకు కాకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసి, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దిన డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని అంత శూన్యం అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసిఆర్ కు బాసటగా నిలిచారని, సంక్షేమ పథకాలు లబ్ధి పొందని కుటుంబం లేదని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ మాయమాటలు నమ్మి అవకాశం కల్పిస్తే అభివృద్ధి నిరోధకులు అవుతారని అన్నారు. తెలంగాణ సంక్షేమం కోసం నియోజకవర్గం అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి గాదరి కిషోర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి పరుశరాములు, వార్డు మెంబర్లు లావణ్య, సాగర్, సతీష్, రంజాన్, సామేల్, రాము తదితరులు పాల్గొన్నారు.