ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్.. 8 మంది విద్యార్థులకు అస్వస్థత

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 8 మంది నర్సింగ్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రసాయనాలున్న ఆ ట్యాంకర్‌ను జనాలకు దూరంగా తరలించారు. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం కర్ణాటక నుంచి కేరళలోని ఎర్నాకులం వెళ్తున్న ట్యాంకర్ లారీ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైంది. రామాపురంలో
ఆ ట్యాంకర్‌ను నిలుపడంతో ఆ ప్రాంతంలోని నర్సింగ్‌ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో పరియారం మెడికల్ కాలేజీ ఆస్పతి, పజయంగడి ఆస్పత్రికి వారిని తరలించి చికిత్స అందించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఆ ట్యాంకర్‌ వద్దకు చేరుకున్నారు. కంటైనర్ వెనుక వాల్వ్‌లో లీకేజీని గుర్తించారు. అయితే గ్యాస్‌ లీక్‌ను పూర్తిగా అరికట్టలేకపోయారు. దీంతో ఆ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో ట్యాంకర్‌లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యానికి గురైన నర్సింగ్‌ విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

Spread the love