మార్కెట్ కు జనరల్ రిజర్వేషన్ ఖరారు

– మార్కెట్ ఛైర్మన్ పదవి పై ఆశావహుల ఆశలు
– ప్రచారంలో వేణా రెడ్డి, భాస్కర్ ల పేర్లు
– దామన్న ఆశీస్సులు ఎవరికో
నవతెలంగాణ – సూర్యాపేట
రాష్ట్రం లో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుగాంచిన సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహుల మధ్య పోటీ తీవ్రతరం కానున్నది. పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడంతో గత కొన్ని సంవత్సరాలుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా గతంలో జనరల్ మహిళా రిజర్వేషన్ గా ఉన్న సూర్యాపేట మార్కెట్ చైర్మన్ పదవీ రొటేషన్ పద్ధతిలో  జనరల్ గా మారింది. కాగా జిల్లాలోని మార్కెట్ల వారీగా రిజర్వేషన్లను పరిశీలిస్తే…..కోదాడ ఎస్సీ మహిళ గా మారగా తుంగతుర్తి మార్కెట్ ఓసి జనరల్ గా తిరుమలగిరి ఓసి మహిళా గా,నేరేడుచర్ల బిసి మహిళా గా హుజూర్ నగర్ మార్కెట్ ఓసి మహిళా గా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఆయా మార్కెట్లకు ప్రభుత్వం ఉత్తర్వులను పంపినది. సూర్యాపేట జనరల్ కావడంతో పార్టీలో భారీగా ఆశావహులు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఇదిగాక  పార్లమెంట్  ఎన్నికల కాలం కాబట్టి షెడ్యూల్ కు ముందే కమిటీలను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యంపీ ఎన్నికల సమయంలో నాయకులతో పాటు ప్రతి కార్యకర్త సేవలు పార్టీకి అవసరం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంటుంది.ఈ నేపథ్యంలో  గత పది సంవత్సరాలు గా కష్ట కాలం నుండి ప్రస్తుతం వరకు తనను నమ్ముకొని ఉన్న వారికి  మాజీమంత్రి దామోదర్ రెడ్డి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తన ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నుంచి పార్టీలో చేరిన వారికి తగిన న్యాయం చేయాలని భావిస్తే మాత్రం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికలో దామోదర్ రెడ్డి  తీసుకునే నిర్ణయం నియోజకవర్గంలో సర్వత్రా ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. ఇంతకీ ఆర్డిఆర్  ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి..? ఎవరికి చైర్మన్ పదవి వరించబోతుందనే ప్రశ్న మాత్రం ఆశావాహుల్లో ఉత్కంఠను రేపుతోంది. సాధారణంగా జనరల్ కోటా అనగానే అగ్ర వర్ణాల వారు పోటీలో నిలవడం సహజం. దానికి అనుగుణంగానే నియోజకవర్గం లోని కొందరు ముఖ్య నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందుకోసం ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ సారి పోటీలో ఉన్న వాళ్ళు తప్పకుండా తమకే చైర్మన్ పదవి దక్కుతుందని పార్టీ అభివృద్ధి కోసం తాము చేసిన కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని చెబుతున్నారు.ఇదిలావుండగా గత నలభై ఏళ్లు గా దామోదర్ రెడ్డి తో ట్రావెల్ చేస్తున్న కొప్పుల వేణా రెడ్డి, పోతు భాస్కర్ లు మాత్రం ఇంతవరకు ఎలాoటి నామినేటెడ్ పదవులను ఆశించలేదు. దామన్న ఐదు సార్లు ఎమ్మెల్యే గా రెండు సార్లు మంత్రి గా కొనసాగిన సమయంలో కూడా వారు మాత్రం ప్రత్యక్ష, పరోక్ష పదవులను పొందలేదు.  కాగా కాలక్రమంలో వారివురు కూడా అప్పటి నుండి ప్రస్తుతం వరకు తమ జీవితాన్ని దామన్న కోసమే వెచ్చిస్తు వస్తున్నారు.కాగా మార్కెట్ చైర్మన్ పదవి వేణా రెడ్డి, భాస్కర్ లలో ఎవరో ఒకరు తీసుకునే అవకాశం ఉందని నియోజకవర్గo లో ప్రచారం సాగుతోంది. ఇందుకనుగుణంగా వారి అభిమానులు కూడా కాబోయే మార్కెట్ చైర్మన్ లు అంటూ వేర్వేరుగా సోషల్ మీడియాలలో పోస్టింగ్ లు పెడుతున్నారు.కాగా వారి మనసులో ఏముందో మాత్రం తేలాల్సి ఉంది.మరి ఈ నేపథ్యంలో పరిశీలిస్తే… చైర్మన్ పదవి కోసం కోతి గోపాల్ రెడ్డి, కాకి కృపాకర్ రెడ్డి, తూముల సురేష్,పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ,శనగాని రాంబాబు గౌడ్, మాడుగుల నవీన్,వాస రాజశేఖర్ లు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో మాత్రం కొంత మంది తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.ఇంకా ఆశావహులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అందుకు ముందుగానే ప్రభుత్వం అన్నీ ప్రాంతాల్లో మార్కెట్ కమిటీ లను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో పార్టీ అభివృద్ధితో పాటు దామన్న వెన్నంటే ఉన్న నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ కుర్చీ కోసం పోటీ పడే వారిలో ఆర్డిఆర్  అండ దండలు ఎవరికి ఉంటాయో అనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆశవాహులు అందరూ కూడా దామోదర్ రెడ్డి కి ముఖ్యులే అవ్వడం తో  పదవి ఎంపిక చర్చనీయాంశంగా మార నున్నది.
Spread the love