ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. 2022 మే నుంచి ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, మూడు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛార్జ్‌ కమెండేషన్ కార్డ్‌లను ఆయన అందుకున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఉపేంద్ర ద్వివేది, సైనిక్ స్కూల్ రేవాలో చదివారు. 1981 జనవరిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో చేరారు. 1984 డిసెంబర్‌లో జమ్ముకశ్మీర్‌ రైఫిల్స్ 18వ బెటాలియన్‌లో నియమితులయ్యారు. ఆ తర్వాత కశ్మీర్ లోయ, రాజస్థాన్‌ ఎడారులలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బెటాలియన్‌కు నేతృత్వం వహించారు. మరోవైపు ఇన్‌స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌గా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఉపేంద్ర ద్వివేది విశేష సేవలు అందించారు. ఈశాన్య ప్రాంత కమాండర్‌తోపాటు ఇండో-మయన్మార్ సరిహద్దు నిర్వహణ బాధ్యతలు వహించారు. ఆ తర్వాత రైజింగ్ స్టార్ కార్ప్స్‌ను కమాండ్‌ చేశారు. 2022-2024 వరకు సవాళ్లతో కూడిన వెస్ట్రన్ ఫ్రంట్, నార్తర్న్ ఆర్మీకి నేతృత్వం వహించారు.

Spread the love