– 1980 నుండి 40కి పైగా బ్యాచులు పూర్తి
– 44 ఏళ్లక తర్వాత కలిసే అవకాశం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో చరిత్రలలో మొదటిసారిగా 1980 నుండి అన్ని బ్యాచులకు సంబంధించి పూర్వ సమ్మేళననాన్ని ఈనెల 12న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమ్మేళనానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని కళాశాలలో ప్రిన్సిపాల్ బండి రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. అందుబాటులో ఉన్న అల్యూమ్ని మెంబర్స్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 12న జరిగే కార్యక్రమంపై చర్చించారు. పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ పలు సలహా సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కు సంబంధించి పలువురికి పలు బాధ్యతలు ఇస్తూ పలు కమిటీలను వేశారు. అనంతరం అడహాక్ కమిటీని పూర్వ విద్యార్థుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా అభయ్ రాజ్, కార్యదర్శిగా ఉమ శంకర్, కోశాధికారిగా విజయ్ బాబు, కమిటీ సభ్యులుగా ఫాతిమా, నీల్ కమల్, జి.శ్రీకాంత్, ఆర్ సందీప్, ఆర్.ప్రణయ్, టి.అజయ్, ఎన్ రుత్విక్ ను ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఈనెల 12న పూర్వ విద్యార్థుల మొదటి అల్యూమ్ని సమావేశం జరగనున్నట్లు ప్రిన్సిపాల్ బండి రాంబాబు పేర్కొన్నారు. 1980 నుండి 2024 వరకు దాదాపు 40కి పైగా బ్యాచులు పూర్తయ్యాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. వారికి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సందేశాన్ని పంపుతూ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కలిసి చదువుకున్న రోజులను నెమరవేసుకోవడానికి, తోటి స్నేహితులను, అధ్యాపకులను కలవడానికి ఇదొక మంచి వేదిక అని కొనియాడారు. కావున పూర్వ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.