పిచ్చికుక్క దాడిలో బాలికకు తీవ్రగాయాలు..

– పిచ్చికుక్కల దాడిని అరికట్టాలి 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
పిచ్చికుక్క దాడిలో బాలికకు తీవ్రగాయాలైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని చింతోళ్లగుంపు గ్రామానికి చెందిన తోలెం సారయ్య-కళావతి దంపతులకు 11సంవత్సరాల కూతురు మనోజ్ఞ కలదు. మనోజ్ఞ తన తల్లిదండ్రులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తూ.. అందరూ నిద్రపోయారు. అదేసమయంలో ఓ పిచ్చికుక్క ఇంట్లోకి వచ్చి మనోజ్ఞపై దాడి చేసింది. నిద్రనుండి లేచి మనోజ్ఞ బిగ్గరగా అరవడంతో తన తల్లిదండ్రులకు మెళుకువ వచ్చి చూసే లోపే పిచ్చికుక్క మనోజ్ఞ కుడి కాలుపై రెండు సార్లు దాడి చేయడంతో కాలుకి కుక్క పంటి గాట్లు పది చోట్ల లోతుగా పడ్డాయి. దాంతో తల్లిదండ్రులు బాలికను ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తదనంతరం వైద్య సిబ్బంది సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మనోజ్ఞకు వైద్యం అందించి, తగిన మందులు ఇచ్చి తిరిగి ఇంటికి పంపారని, కూతురి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తండ్రి సారయ్య తెలిపారు. పిచ్చికుక్కల దాడిని అరికట్టేందుకు స్థానిక సంబంధిత అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని మనోజ్ఞ తల్లిదండ్రులు, చింతోళ్లగుంపు గ్రామస్తులు కోరుతున్నారు.
Spread the love