బీడు భూములకు గోదావరి జలాలు

– వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– సీతారామ ట్రయల్‌ రన్‌ను ప్రారంభించిన ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి
నవతెలంగాణ-అశ్వాపురం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడీ భూములకు గోదావరి జలాలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆశ్వాపురం మండలంలోని భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్‌ ఫేజ్‌ వన్‌ పంప్‌ హౌస్‌ వద్ద విద్యుత్‌ మోటర్‌ను తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సీతారామ ప్రాజెక్టు సలహాదారులు పెంటారెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి ట్రయల్‌ రన్‌ను ప్రారంభించారు. దాంతో పంప్‌హౌస్‌లోని గోదావరి జలాలు కాలువలోకి పరుగులెత్తాయి. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహకారంతో శ్రీరామచంద్రుడు ఆశీస్సులతో అహర్నిశలు శ్రమించి ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సహకరించిన అధికారులు, ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన అన్నదాతలకు ఆయన పాదాభివందనం చేశారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా ఏన్కూరు లింక్‌ కెనాల్‌, అదేవిధంగా వైరా లంక సాగర్‌ ప్రాజెక్టు ద్వారా మధ్యలో ఉన్న చెరువులన్నింటినీ నింపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఏన్కూర్‌ మెయిన్‌ కెనాల్‌ పూర్తి చేసి వైరా ప్రాజెక్టు కూడా నీళ్లు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. బిజీ కొత్తూరు పంప్‌ హౌస్‌ వద్ద 6 మోటర్లను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా దిగువకు 9వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయనున్నట్టు తెలిపారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన ఫేజ్‌ టు, ఫేజ్‌ త్రీ పంప్‌ హౌస్‌ల వద్ద అమర్చిన విద్యుత్‌ మోటార్లు కూడా త్వరలోనే ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాలవంచ సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్టు తెలిపారు. మిగిలిపోయిన ఈ ప్రాజెక్టు పనులను జులై చివరినాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌తో మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి విశేషంగా కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎంపీపీ ముత్తినేని సుజాత, నీటిపారుదల శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్‌, మాజీ సర్పంచి మర్రి మల్లారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరు బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Spread the love