నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రం ఏటా తమ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. డీఏ అనేది ఉద్యోగులకు వర్తిస్తే, డీఆర్ పెన్షనర్లకు అందిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి పరిహారంగా ఇక్కడ కేంద్రం వీరికి బేసిక్ పేపైన ఈ భత్యాల్ని చెల్లిస్తుంటుంది. దీంతో నేరుగా చేతికందే జీతం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక దీనిని ఏటా రెండు సార్లు ప్రకటిస్తుంటుంది. తొలి అర్ధభాగంలో హోలీ సమయంలో మార్చిలో ఒకసారి, రెండో అర్ధభాగంలో మాత్రం దసరా లేదా దీపావళి సమయంలో సెప్టెంబర్/అక్టోబరులో అనౌన్స్ చేస్తుంది. ఇక వీటిని మాత్రం జనవరి 1, జులై 1 నుంచే అమలు చేస్తుంది. ఇక్కడ దానికి అనుగుణంగా ఆ నెలల బకాయిల్ని కూడా విడుదల చేస్తుంది. దీంతో ఆలస్యంగా ప్రకటించినా ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి నష్టం ఉండదు.
ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మరోసారి పెరగనుంది. జులై ముగిసి ఆగస్టులోకి ప్రవేశించిన నేపథ్యంలో వారు తమ డీఏ, డీఆర్ గురించి చర్చించుకుంటున్నారు. కిందటిసారి 2 శాతమే పెరగ్గా ఈసారి మళ్లీ 3 శాతం పెరిగి ప్రస్తుతం ఉన్న 60 శాతం నుంచి 63 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఇక్కడ డీఏ, డీఆర్ పెంపును ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్- ఇండస్ట్రియల్ వర్కర్స్ గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తారు. దీనిని కేంద్ర కార్మిక శాఖ విడుదల చేస్తుంటుంది. ఇక్కడ 7వ వేతన సంఘం సిఫార్సుల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.



