ఈజిప్టు మాజీ అధ్యక్షుడు అన్వర్ సాదత్‌ను ఎందుకు చంపావని అడిగాడు జడ్జి హంతకుణ్ణి.
అతను సెక్యులర్! -అని అన్నాడు హంతకుడు.
సెక్యులర్ అంటే ఏమిటీ? – అడిగాడు జడ్జి.
ఏమో! నాకు తెలియదు – అన్నాడు హంతకుడు.
మన భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సమాధానం కూడా ఇలాగే ఉంటుంది. వారికి సెక్యులర్ అంటే అర్థం కాదు. కానీ, ఎవరైనా ఆ మాట ఉచ్ఛరిస్తే చాలు వారి పైకి ఈడి, సిబిఐ, ఎఎన్‌ఎ వంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఉసి గొల్పుతుంది. దేశవ్యాప్తంగా లెక్కలేనంత మందిపై ఎంక్వ యిరీలు వేశారు… కదా? వేస్తున్నారు … కదా? కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదే? ప్రజా సంక్షేమ ప్రభుత్వం కావాలనుకుంటే, ఇదేమిటి? ప్రజా సంక్షోభ ప్రభుత్వం దాపురించిందీ – అని ప్రజలు వాపోతున్నారు.
ఈజిప్టు రచయిత నగిబ్ మహపౌజ్‌ను కత్తితో పొడిచి చంపిన కేసులో జడ్జి హంతకుణ్ణి అడి గాడు.
నగిబ్ మహపౌజ్‌ను కత్తితో పొడిచి ఎందుకు చంపావ్?
అతను ‘ద చిల్డ్రన్ ఆఫ్ అవర్ నైబర్ హుడ్’ అని రాసాడు కాబట్టి చంపాను.
ఓ-నువ్వా నవల చదివావా? – జడ్జి అడిగాడు.
లేదు – అన్నాడు హంతకుడు.
ఇది కూడా అధికారంలో ఉన్న భారత ప్రభుత్వానికి సరి పోతుంది. ఆరోతరగతి కూడా చదవని ఆరెస్సెస్ మేధావి ప్రభు త్వాధినేత అయితే, రచయితల్ని, జర్నలిస్ట్‌లని సనాధర్మ సంస్థ ద్వారా చంపించడం ఒక్కటే మార్గం అని అనుకుంటాడు. గౌరీ లంకేశ్, కల్పుర్గీ, పన్సారే, డా.దబోల్కర్‌లే కాదు. వరవరరావు. ప్రొ.సాయిబాబా- వగైరా ఎంత మంది పేర్లయినా చెప్పుకో వచ్చు. వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టే పనులు చేశారా? జన చైత న్యానికి రచనలు చేసేవారిని- ప్రధాని హత్యకు పథకాలు రచిం చారని జైల్లో వేస్తారా? లేదా చంపిస్తారా? గుజరాత్, మణిపూర్ మారణ కాండలు జరిపించడం మీకింకా చాలలేదా? ఏమైతేనేం చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారు సామీ! ఖాళీ మెదళ్ళే లొడలొడమని ఎక్కువ శబ్దం చేస్తాయి మిత్రో.
ఈజిప్టు రచయిత ఫరాజ్ ఫరాను చంపిన మరో హంతకుణ్ణి జడ్జి ఇలా ప్రశ్నించారు –
ఫరాజ్‌ను ఎందుకు హత్య చేశావ్?
ఎందుకంటే, అతడు నమ్మకద్రోహి- అన్నాడు హంతకుడు.
అతను నమ్మక ద్రోహి అని నీకు ఎలా తెలుసూ?- జడ్జి.
అతను రాసిన పుస్తకాల వల్ల!- హంతకుడన్నాడు.
అయితే, అతను రాసిన పుస్తకాలు ఏవేవీ చదివావూ?- జడ్జి.
నేనేదీ చదవలేదు – అన్నాడు హంతకుడు.
ఏం? ఎందుకు? – జడ్జి అడిగాడు
ఎందుకంటే, నాకు చదవడం, రాయడం రాదు!
రచయిత్రి అరుంధతీ రారుని కూడా ఈ ప్రభుత్వం వదిలి పెట్టలేదు. పుస్తకాలు చదివే అలవాటే ఉంటే, ఈ దేశ పాలకులు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తారూ? దేశ నాయకుడే కాదు, ఆయన అనుచరగణంలోని ఎవరైనా సరే, అరుంధతీ రారు రచనలో ఒక పేజీ చదివి అర్థం చెప్పగలిగితే – ఈ దేశ ప్రజలు తమ చెప్పులతో తామే కొట్టుకుంటారు. చెప్పలేకపోతే దేశ ప్రజల చెప్పు దెబ్బలు ఎవరికి తగలాలీ?
జ్ఞానం వల్ల విద్వేషం ఎప్పుడూ ప్రచారం కాదు. అది అజ్ఞా నం వల్ల – మూర్ఖత్వం వల్లనే ప్రచారమవుతుంది. పైన హంత కులు చెప్పిన సమాధానాల వల్ల మనకు ఈ విషయం రూఢిగా తెలుస్తూ ఉంది. ప్రస్థుతం అధికారంలో ఉన్న వారి పనితీరు నిశి తంగా గమనించండి. వారి చూపు వర్తమానం మీద లేదు. భవి ష్యత్తు మీద అసలే లేదు – గతాన్ని తవ్వి తీసి, గొప్పలు చెప్పుకోవడంలోనే ఉంది.. మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి- అని చెప్పుకోవడమే – తాగితే తాగారు వదిలేయండి! ఇప్పుడు ప్రజలు తాగాల్సిన నెయ్యినంతా తీసుకుపోయి అదానీకి ఎందుకు తాగిస్తున్నారు?- అన్నది సామాన్యులు సంధిస్తున్న ప్రశ్న!
తెల్లజుట్టు, తెల్లగడ్డం ఉన్న వాళ్ళను చూసి వాళ్ళేదో పెద్దలని అనవసరంగా, అర్హతలేని గౌరవం ఇవ్వగూడదని ధమ్మపథం చెప్పింది- ”తల నెరిసినంత మాత్రాన ఎవరూ పెద్దలు కారు. వారు జీవి తాన్ని వ్యర్థంగా గడిపేసిన వృద్ధులు…మాత్రమే! సత్య, ధర్మాలూ, అహింసా, ఆత్మనిగ్రహాలు, ఇంద్రియ నిగ్రహం ఎవరిలో నెలవై ఉంటాయో, మాలిన్యాలను నిర్జించి నిర్మలుడై నిలిచిన వాడే పెద్ద” – ధమ్మపథం (కలామసుత్త – అంగుత్తర నికాయలో (ఙశీశ్రీ. 188-193) మీరు విన్నవన్నీ నమ్మకండి – అని కూడా అన్నాడు బుద్ధుడు. సనాతనధర్మం పేరు చెప్పి డబ్బులు దండు కుంటున్న ‘శివశక్తి’ ముఠా ఈ మధ్య బయటపడింది. ”సనాతన ధర్మ సంస్థాపనార్థాయ/ పాశాండ మత నిర్మూల నార్దాయ” – అంటూ 2023 సెప్టెంబర్‌లో వార్షికనిధి పేరుతో కొందరు జనం వెంటపడ్డారు. శివాజీ బొమ్మ చూపి ఓ దొంగబాబా మహా రాష్ట్రలో విరాళాలు సేకరించాడు. అందుకే ప్రతి దాన్ని పరీక్షిం చడం, నిజాల నిగ్గు తేల్చుకోవడం ప్రజలు అలవర్చుకోవాలి. ఎవరి మాటలకో ప్రభావితులై డబ్బులు వదిలిం చుకోవడం గానీ, ఓట్లేయడంగానీ, అమ్ముడు పోవడం గానీ చేయగూడదు. దేవీనవరాత్రుల సమయంలో ఒకాయన దేవీ స్త్రోత్రం రాసి, చిన్న పుస్తకం ప్రచురించాడట. దాని ధర ఇరవై రూపాయలట. కానీ, ఐదు వందల రూపాయలు ఫోన్‌పే మీద విరాళం పంపితే ఆ దేవీ ఆశీర్వాదంతో, కవిగారి అభినందనలతో పుస్తకం పంపిస్తారట! వెంటనే డబ్బులు పంపాలని శుభాకాంక్షలతో అందరికీ మెసేజెస్ పంపి, డాబుగా బిచ్ఛమెత్తాడు. మనుషుల్ని మోసం చేయడానికి, బొల్తా కొట్టించడానికి కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. వినాయకుడి పేరుతో విరాళాలు, శివశక్తి పేరుతో విరాళాలు, దేవీ నవరాత్రుల పేరుతో విరాళాలు, సిగ్గూ, ఆత్మాభిమానం వదిలేస్తే డబ్బులు సంపాదించు కోవటా నికి మార్గాలు సులభమౌతాయి. బతికినంత కాలం ధన్‌ధన్ (హిందీ లోధనం) అని ఎంతగా అంగలార్చినా, కన్నుమూయ గానే ‘నిధన్’ (మరణించారు) అనే ప్రకటిస్తారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసిందీ? కూలినాలి చేసుకునే వారితో కూడా బ్యాంక్ ఎకౌంట్‌లు తెరి పించింది. వారికి జరిగిన మేలేమిటీ? ఆ డబ్బంతా తీసుకు పోయి కార్పోరేట్లకు మేలుచేశారే తప్ప, సామాన్యులకు ఒనగూ రిన మేలేమీ లేదు. కార్పోరేట్లకు పెద్ద మొత్తంలో అప్పులు రద్దు చేశారు. తప్పిస్తే పేదలకు మధ్యతరగతి వారి అప్పులేమైనా రద్దు చేశారా? హిందువులు, హిందువులనీ – ఈ దేశం హిందువు లదని – ఈ ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోంది కదా? అసలు ఈ దేశంలో హిందువులకు జరిగిన మేలేమిటో ఆలోచించి ఒక్కటి గుర్తు చేసుకోండి చూద్దాం! హిందువులంతా బంధువులే కదా? ఇల్లు అద్దెకు కావాలని ఎవరైనా వెళ్ళి అడిగితే వారి కులం, గోత్రం, పూర్వాపరాలు అడిగి అడిగి హింసిస్తారెందుకూ? ఈ ప్రధాని నోట్లు రద్దు చేసినప్పుడు బ్యాంకుల ముందు క్యూలల్లో హిందువులు చావకుండా ఉన్నారా? విదేశాల నుండి నల్లడబ్బు తెప్పించి, దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్న ఈ దేశ ప్రధాని, కనీసం హిందువుల ఖాతాల్లోన్నైనా వేయాలి కదా? ఏవీ మరీ? ఎవరికీ ఏ ఉపయోగం జరగనప్పుడు హిందూ అనే పదం మాటి మాటికీ వల్లె వేయడం ఎందుకూ? ఒకప్పుడు ఫారసీ డిక్షనరీలలో వాళ్ళు రాసుకున్నదాన్నే నేటి పాలకులు నిజం చేసి చూపుతున్నట్టుగా ఉంది!
హిదూమతం మీద మా వివేకానందుడు అమెరికాలో గొప్పగా ఉపన్యసించి వచ్చాడని చెప్పుకుంటారు కదా? మరి ఆయనే ఆనాటి దేశ పరిస్థితిని చూసి ఏమన్పాడో చూడండి- ”అస్పృశ్యులనబడే ప్రజలను ఈనాటి అధ్వాన్నస్థితికి దిగజార్చిన వారెవరూ? ఎవరు దీనికి బాధ్యులు? దీనికి ఆంగ్లేయులు మాత్రం బాధ్యులు కారు. అనేక పారమార్థిక, వ్యవ హారిక సిద్ధాం తాలను కనిపెట్టిన హిందూమతంలోని కుటిలులే ఇందుకు కారకులు”- అన్న స్వామి వివేకానంద ‘దేశాన్ని పునర్నిర్మించండి’ అని పిలుపునిచ్చాడు (స్వామి వివేకానంద పేజి:16 రామకృష్ణ మఠం ప్రచురణ) అంతే కాదు సైన్స్ లాగా మతాలు కూడా మారుతూ ఉండాలని కూడా చెప్పాడు. ఈ దొంగ రాజకీయ మతపెద్దలు ఇలాంటి విషయాల్ని బయటకు రానీయరు.
చదువులేని అజ్ఞానులు కొంతమంది, చదువుకున్న మూ ర్ఖులు మరి కొంతమంది కలిసి నడుపుతున్న ఈ ప్రభుత్వంలోని ‘పెద్దలు’ 1916లో బనారస్ లోని సెంట్రల్ హిందూ కాలేజి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కలిసి ప్రచురించిన AN ELEMENTARY TEXT: HINDU RELIGION AND ETHICS తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఇది వారి ఆలోచనా ధోరణి గల మహాను భావులే అచ్చేశారు కాబట్టి! సనాతన ధర్మం గురించి మాట్లాడే సంప్రదాయ వాదులు ఆ గ్రంథం చదివాకే నోరువిప్పాలి! అప్పుడు వారు రాసి పెట్టిన దానికీ, ఇప్పుడు వీరు మాట్లాడు తున్నదానికీ వ్యత్యాసం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి! ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోమంటున్నాం – అంతే ఇంకా వేరే సాక్ష్యాలెందుకూ?
ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అంటే గిట్టదు. ఎందు కంటే ఒక రకమైన న్యూనతా భావం ×అ టవతీఱశీతీఱ్y జశీఎజూశ్రీవఞ! అల్లకల్లోంగా ఉన్న ఆనాటి దేశాన్ని ఆయన తన వివేకంతో, దార్శ నికతతో, ప్రగతిశీల దృక్పథంతో ముందుకు నడిపారు. ఇప్పటి ఈ ప్రభుత్వం ఏం చేసిందీ? స్థిరంగా ఉన్న దేశాన్ని అస్థిర పరి చింది. సామాన్యుడి బతుకు బజారుపాలు చేసి, కార్పోరేట్లకు భజన చేస్తూ, తన్మయత్వంలో తేలిపోతోంది. దీన్నే దేశభక్తిగా భావించాలని దేశ ప్రజలకు ఉద్భోదిస్తోంది. దేశం ఎంత వెనక్కి పోతోందో చూసు కుందామన్న స్పృహ కూడా లేదు – వైజ్ఞానిక దార్శనికుడు, నిరీశ్వరవాది, రచయిత, పరిపాలనాదక్షుడు అయిన పండిట్ నెహ్రూకు సంబంధించిన వార్త – ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. ఇది 1954 ఏప్రిల్ 12 ఆంధ్రపత్రిక డైలీ ప్రచురించిన వార్త ”అహ్మదాబాదు, ఏప్రిల్ 10 : అహ్మ దాబాదు వస్త్రపారిశ్రామిక పరిశోధనా కేంద్రం భవనానికి నెహ్రూ జీ ప్రారంభోత్సవానికి వచ్చినపుడు, పురోహితుడు మంత్ర పఠనం మొదలు పెట్టాడు. నెహ్రూజీ సౌమ్యంగా ఆపమని సైగ చేశాడు. తెలివిలేని పురోహితుడు విషయం గ్రహించకుండా శ్లోకాలు పఠిస్తూ, నెహ్రూకు తిలకం దిద్దాలని ప్రమత్నించాడు. ఆయన చికాకు పడి ”ఈ గోల నేను భరించలేను. ఏమిటిదంతా – నాన్సెస్” అంటూ అడ్డుగా ఉన్న పురోహితుణ్ణి పక్కకు నెట్టి – చరచరా భవనంలోకి నడిచి వెళ్ళిపోయాడు. – ”దేశం వైజ్ఞానికం గా ముందుకు పోవాలనుకునే వారి చర్యలు ఏ విధంగా ఉండాలో… ఆయన ఆనాడే చేసి చూపించారు.
– కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు విజేత, జీవశాస్త్ర వేత్త
(మెల్బోర్న్ నుంచి)
డాక్టర్ దేవరాజు మహారాజు